: అంధత్వాన్ని అధిగమించవచ్చు
కంటి రెటీనాలోని నాడీ కణాలు దెబ్బతినడం వల్ల చూపు మందగించడం, లేదా కోల్పోవడం జరుగుతుంది. తద్వారా అంధత్వం ప్రాప్తిస్తుంది. అలా వచ్చే అంధత్వాన్ని అధిగమించేందుకు కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి.
వీరు చేస్తున్న పరిశోధనల ద్వారా అంధత్వాన్ని కూడా అధిగమించవచ్చని చెబుతున్నారు. కేంద్ర నాడీ వ్యవస్థ నుండి సేకరించిన కణాలతో కృత్రిమ కణజాలాన్ని సృష్టించి చూపును ప్రసాదించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. వీరు ఎలుకల్లోని గాంగ్లియన్, గ్లియాల్ కణాలతో కణజాలాన్ని సృష్టించారు. ఫైజో`ఎలక్ట్రానిక్ ఇంక్‌జెట్ ప్రింటర్ ద్వారా దీన్ని ముద్రించారు. ఇందులోని కణాలు సాధారణ వాతావరణాన్ని తట్టుకుంటూ ఆరోగ్యంగా ఉంటున్నట్టు పరిశోధకులు చెబుతున్నారు. ఇది విజయవంతం అయితే త్వరలోనే రెటీనా పాడుకావడం వల్ల చూపు కోల్పోయిన అంధుల జీవితంలో మళ్లీ వెలుగు రేఖలు ప్రసరించే అవకాశం ఉంది.