: నేను టీ అమ్ముతాను కానీ.. దేశాన్ని అమ్మను: మోడీ
బీజేపీలో అట్టడుగు స్థాయి వ్యక్తులకు కూడా ప్రధాని అయ్యే అవకాశం ఉందని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ అన్నారు. టీ అమ్మే వ్యక్తి దేశానికి ప్రధాని అవుతాడా? అంటూ తనను విమర్శిస్తున్నారని... తాను టీ అమ్ముతాను కానీ, దేశాన్ని మాత్రం అమ్మనని విపక్షాలపై విరుచుకుపడ్డారు. టీ అమ్మే వ్యక్తులకు దేశ ప్రధాని అయ్యే హక్కు లేదా? అంటూ సూటిగా ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో జరిగిన బహిరంగ సభలో నరేంద్ర మోడీ ప్రసంగించారు.
యూపీఏ ప్రభుత్వం సామాన్య ప్రజల గోడును ఏమాత్రం పట్టించుకోవడం లేదని మోడీ ఆవేదన వ్యక్తం చేశారు. యూపీఏకు ఓట్లు మాత్రమే కావాలని విమర్శించారు. యూపీఏ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ఉత్తరప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఉత్తరప్రదేశ్ ప్రజల సహకారంతోనే రామరాజ్యం సాధ్యమవుతుందని చెప్పారు. రైతులు, పేదల సంక్షేమాన్ని ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని అన్నారు.
దేశంలో నిరుద్యోగానికి కారణం... యువశక్తిని సరిగా వినియోగించుకోకపోవడమే అని మోడీ తెలిపారు. భారతదేశం నుంచి కాంగ్రెస్ ను తరిమికొట్టినప్పుడే... మన దేశంలో పేదరికం, నిరుద్యోగాలను నిర్మూలించగలుగుతామని అన్నారు. ఇప్పటికే దేశంలో కాంగ్రెస్ పతనం ప్రారంభమయిందని... ప్రజల మద్దతుతో కాంగ్రెస్ ను కూకటివేళ్లతో పెకిలించేస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ బీజేపీ వారిని దొంగలుగా సంబోధిస్తుంటుందని... ఔను తాము దొంగలమే అని, ఎందుకంటే తాము కాంగ్రెస్ వారి నిద్రను దొంగలించామని అన్నారు.