: సమైక్య రాష్ట్రానికి మద్దతిస్తే బీజేపీతోనైనా పొత్తుకు సిద్ధం: వైఎస్ జగన్
తెలుగు ప్రజలందరూ సమైక్యంగా ఉండేందుకు ప్రతి రోజూ పార్లమెంటు లో పోరాటం చేశామని వైఎస్సార్సీపీ అధినేత జగన్ చెప్పుకొచ్చారు. అయితే పార్లమెంటు సమావేశాలు జరిగిన తీరు గమనిస్తే బాధేస్తోందని ఆయన అన్నారు. టీడీపీ ఎంపీలు ఒక వైపు, తమ ఎంపీలు మరో వైపు ఉంటే ప్రజలకు ఎలా న్యాయం జరుగుతుందని ఆయన ప్రశ్నించారు. అందుకే, పార్టీలకు అతీతంగా సమైక్య రాష్ట్రం కోసం అందరూ కలిసి రావాలని జగన్ విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ కు జరుగుతున్న అన్యాయం గురించి దేశ వ్యాప్తంగా నేతలను కలిసి న్యాయం చేయమని అడిగామని ఆయన చెప్పారు. విభజన అంశాన్ని దేశప్రజలందరి దృష్టికి తీసుకెళ్లడంలో విజయం సాధించామని ఆయన తెలిపారు.
ఇక, ముసాయిదా బిల్లుపై శాసన సభ సమావేశాలు జరిగినప్పుడు చంద్రబాబు కనీసం అసెంబ్లీ హాలులోకి రాలేదని, బాబు తన గదికే పరిమితమయ్యారని జగన్ విమర్శించారు. సీఎం కిరణ్ కూడా తక్కువేమీ కాదన్నారు. పైకి సమైక్యవాదినని చెబుతోన్న ఆయన.. ముసాయిదా బిల్లుపై చర్చ జరిపేందుకు తెలంగాణ వాదులకు అవకాశం ఇస్తూ అంతర్లీనంగా విభజన వాదాన్ని చాటుకుంటున్నారని జగన్ దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో సమైక్యవాదానికి మద్దతిచ్చే ఏ పార్టీతోనైనా కలిసి పోటీ చేసేందుకు సిద్ధమని ఆయన ప్రకటించారు. బీజేపీతో కలుస్తారా... అన్న ప్రశ్నకు, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతామంటే, ఆ పార్టీతో కూడా పొత్తును స్వాగతిస్తామని జగన్ చెప్పారు.