: జూబ్లీహిల్స్ వాణిజ్య కార్యకలాపాలపై జీహెచ్ఎంసీ వివరణ కోరిన హైకోర్టు
హైదరాబాదులో సంపన్నులు, ప్రముఖులు నివసించే జూబ్లీహిల్స్ ప్రాంతంలోని వాణిజ్య కార్యకలాపాలపై హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. పిటీషన్ ను స్వీకరించిన హైకోర్టు ఇవాళ విచారణను చేపట్టింది. జూబ్లీహిల్స్ వ్యాపార కార్యకలాపాలు, నివాసాలపై నివేదికను ఇవ్వాలని హైదరాబాద్ మహా నగర మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) అధికారులను ఆదేశించింది. ప్రముఖుల నివాసాల కోసమే జూబ్లీహిల్స్ లే-అవుట్ ను రూపొందించారని, అందుకు అనుగుణంగానే బిల్డింగ్ ప్లానులకు అనుమతి ఇవ్వాల్సి ఉంటుందని పిటీషన్ లో పేర్కొన్నారు. మరి అలాంటి ప్రాంతంలో వాణిజ్య కార్యకలాపాలు జరుగుతున్నా సంబంధిత అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదని.. బిల్డింగ్ ప్లాన్ లకు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతున్నా పట్టించుకున్న దాఖలాలు లేవని పిటీషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. దానిపై స్పందించిన హైకోర్టు ధర్మాసనం జూబ్లీహిల్స్ పరిధిలోని నిర్మాణాలపై నివేదిక ఇవ్వాల్సిందిగా జీహెచ్ఎంసీని ఆదేశించింది.