: ఎర్రచందనం స్మగ్లర్లపై హత్య, డెకాయిట్ కేసు నమోదు: తిరుపతి అర్బన్ ఎస్పీ
ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టేందుకు తాము శాయశక్తులా కృషి చేస్తున్నామని, అటవీ శాఖ సిబ్బందితో విధి నిర్వహణలో ఎలాంటి సమన్వయ లోపం లేదని తిరుపతి అర్బన్ ఎస్పీ రాజశేఖర్ బాబు స్పష్టం చేశారు. ఎర్రచందనం స్మగ్లర్లను సమర్థంగా ఎదుర్కొనే క్రమంలోనే సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని, ఎర్రచందనం దొంగలపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. పట్టుబడిన వంద మంది స్మగ్లర్లపై.. హత్య, డెకాయిట్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని ఎస్పీ తెలిపారు. ఇవాళ సాయంత్రం తిరుపతిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. సమాచారం అందుకున్న వెంటనే మొదట ఎనిమిది మంది సిబ్బంది అటవీ ప్రాంతానికి వెళ్లారని, ముందు వెళ్లిన వారి ప్రాణాలను రక్షించేందుకు మరో బృందాన్ని ఫారెస్ట్ ఏరియాకు పంపించామని ఆయన పేర్కొన్నారు.