: సభలో మహిళలకు రక్షణ లేదా?: కన్నీరు పెట్టుకున్న నన్నపనేని
స్వామిగౌడ్ దౌర్జన్యంపై ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షాత్తు శాసనమండలి ప్రాంగణంలోనే సభ్యుల మీద దాడులు జరుగుతుంటే రేపు పరిస్థితి ఏంటని ఆమె ప్రశ్నించారు. సీమాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధులుగా తమ అభిప్రాయాలు, తమ ప్రాంత ప్రజల గొంతు వినిపించాల్సిన అవసరం లేదా? అని నిలదీశారు.
అసెంబ్లీ సాక్షిగా దౌర్జన్యం, దాడి జరిగితే.. రేపు రాష్ట్ర విభజన జరిగితే సామాన్య ప్రజానీకాన్ని వీరు బ్రతకనిస్తారా? అని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. మహిళలు ఉన్నారని కూడా చూడకుండా స్వామిగౌడ్ దాడి చేస్తుంటే పోలీసులు చూస్తూ ఊరుకున్నారని, ఆయనను నియంత్రించేందుకు ఏమాత్రం ప్రయత్నించలేదని ఆమె గుర్తు చేశారు. తన ప్రక్కనే ఉన్న దళిత మహిళపై కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు దాడికి దిగారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.