: వేమన చెప్పిందే మళ్లీ చెబుతున్నారు
అనగననగ రాగమతిశయిల్లుచునుండు.... తినగ తినగ వేము తియ్యనుండు... సాధనమున పనులు సమకూరు ధరలోన... అని ఏనాడో వేమన చెప్పాడు. ఇప్పుడు శాస్త్రవేత్తలు పలు పరిశోధనలు చేసి మరీ ఇదే విషయాన్ని చెబుతున్నారు. గణితంలో మంచి ప్రతిభ కనబరచాలంటే అది స్వతహాగా రాదని, దానిని ఎవరైనా సాధన ద్వారా సొంతం చేసుకోవచ్చనీ చెబుతున్నారు. కొందరు లెక్కలు అవలీలగా చేస్తుంటారు. మరికొందరికి లెక్కలంటే భయం. ఇలా కొందరు మాత్రమే లెక్కలు అవలీలగా చేయడానికి కారణం సాధనేనని, ఎవరైనా సాధన ద్వారా గణితాన్ని చక్కగా అభ్యసించవచ్చని పరిశోధకులు ప్రత్యేక అధ్యయనం ద్వారా తేల్చారు.
నార్వేజియన్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు గణితంలో అద్భుత ప్రతిభ కనబరచడం అనే అంశంపై లోతుగా అధ్యయనం చేశారు. ఈ పరిశోధనలో అన్ని రకాల గణితాల్లో మంచి ప్రతిభ కనబరచాలంటే దానికి నిరంతర సాధన తప్పనిసరి అని పరిశోధకులు చెబుతున్నారు. ఈ విషయం గురించి ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ హెర్‌మందర్ సిమన్‌సన్ మాట్లాడుతూ, గణిత పరిజ్ఞానం అనేది స్వతహాగా వస్తుంది అనేది పాతకాలం నాటి అభిప్రాయం మాత్రమేనని, సాధన ద్వారా ఇది ఎవ్వరికైనా సాధ్యమేనని పేర్కొన్నారు.
ఇందుకోసం వారు సగటున పదేళ్ల వయసున్న వారికి గణిత పరీక్షలు పెట్టారు. వారికి సాధారణ గణిత కూడికలు, తీసివేతలు, గుణించడం, క్యాలెండరు చూడటం, గడియారంపై సమయాన్ని చెప్పడం వంటి పరీక్షలు పెట్టారు. ఈ పరీక్షల్లో ఫలితాలను విశ్లేషించిన మీదట, సహజ నైపుణ్యంకంటే సాధనే గణితంలో ప్రతిభకు కారణమని తేలినట్టు పరిశోధకులు చెబుతున్నారు.