: ఇది నిజంగానే 'స్వీట్ హోమ్'!
చాలామంది తమ ఇంటిని గురించి చెప్పుకోవాల్సి వస్తే తమది స్వీట్ హోమ్ అని చెబుతుంటారు. స్వీట్ హోమ్ అంటే ఎలాంటి బాధలు, సమస్యలు లేని ఆనందాలతో కూడిన ఇల్లుగా మనం చెప్పుకుంటాం. అలాకాకుండా మొత్తం స్వీట్‌తో తయారుచేసిన ఇల్లయితే.... దాన్ని కూడా స్వీట్ హోమ్ అనే కదా అంటాం. అలా ఒక నిజమైన స్వీట్ హోమ్‌ని తయారుచేశారు.
శాన్‌ఫ్రాన్సిస్కోలో క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని 22 అడుగుల ఎత్తుతో 23 అడుగుల వెడల్పుతో రెండస్తుల ఇల్లును నిర్మించారు. ఈ ఇంటిని మామూలు ఇటుకలతో కాదు... జింజర్ బ్రెడ్ అనే మిఠాయితో దీన్ని నిర్మించారు. ఈ స్వీట్ హోమ్ నిర్మాణానికి 7500 జింజర్ బ్రెడ్ ఇటుకలను, 725 కిలోల పంచదార పూతను, 2000 కిలోల కలకండను ఉపయోగించారట. వింటూవుంటేనే నోరూరుతున్న ఈ ఇల్లు చిన్న పిల్లలనే కాదు పెద్దవారిని సైతం తనవైపు ఆకర్షిస్తోందట. స్వీట్ హోమ్ అని చెప్పడం కాదు... ఇది నిజంగా స్వీట్ హోమే అంటున్నారు దీన్ని చూసినవారు. ఈ స్వీట్ హోమ్‌ని చూడాలనుంటే వెంటనే శాన్‌ఫ్రాన్సిస్కోకి బయలుదేరండిమరి!