: పోలీసులను వేధిస్తున్న వందమంది అరెస్టు
ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ఎప్పుడూ పోలీసులు వేధిస్తున్నారంటూ వార్తలు వినడం సహజం.. కానీ పోలీసులనే వేధించిన వంద మందిని ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఆకతాయిలంతా పోలీసు కంట్రోల్ రూంలో విధులు నిర్వర్తిస్తున్న స్త్రీ, పురుష సిబ్బందిని పరుషపదజాలంతో వేధించారని పోలీసులు తెలిపారు. కాగా మొత్తం 400 మందిపై కేసులు నమోదు చేయగా.. అందులో 100 మందిని అరెస్టు చేశారు.
వీరంతా హెల్ప్ లైన్ నెంబర్ 100కి ఫోన్ చేసి పరుషపదజాలంతో పోలీసులను దూషించారు. పోలీసులను దూషిస్తూ 2000 ఫోన్ కాల్స్ రాగా, వాటన్నింటినీ రికార్డు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఆ కాల్స్ ను పరిశీలించి మరింత మందిని అరెస్టు చేస్తామని చెప్పిన పోలీసు అధికారులు, ప్రజా సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ ను దుర్వినియోగం చేయడం సరికాదని హితవు పలికారు.