: అభిమానం అంటే ఇలా వుండాలి
అభిమానం అంటే... దీనికి కరెక్టుగా మనం నిర్వచనాన్ని చెప్పలేం. కానీ తమ అభిమానాన్ని చాటుకోవడానికి నిలువెత్తు బంగారు విగ్రహాన్నే అభిమానులు తయారుచేయించారు. అది మావో విగ్రహం... నవ చైనా జాతిపితగా కీర్తించబడిన మావో జెడాంగ్ 120వ జయంతిని పురస్కరించుకుని చైనాలోని ఆయన అభిమానులు ఆయనకు ఘనమైన గుర్తింపును కల్పించాలని సంకల్పించారు. డిసెంబరు 26న ఆయన జయంతిని ఘనంగా నిర్వహించాలని సన్నాహాలు చేస్తున్నారు. ఒకవైపు ప్రస్తుత చైనా దేశాధ్యక్షుడు జిన్‌పింగ్ పొదుపు మంత్రాన్ని పఠిస్తున్నా మరోవైపు మావో అభిమానులు తమ ఏర్పాట్లు తాము చేసుకుంటున్నారు.
మావో స్వర్ణవిగ్రహాన్ని ఆవిష్కరించారు. 1.6 కోట్ల డాలర్లు అంటే సుమారు వందకోట్ల రూపాయల వ్యయంతో ధగధగలాగే మావో బంగారు విగ్రహాన్ని కమ్యూనిస్టు చైనా ప్రజలు సిద్ధం చేశారు. ఈ బంగారు మావోకు విలువైన రాళ్లను పొదిగి రూపొందించారు. దీని బరువు యాభై కిలోలకు పైగానే ఉంటుంది. శుక్రవారం నాడు షెంజెన్ పట్టణంలో దీన్ని ఆవిష్కరించారు. మావోపై తమ ప్రేమను తెలపడానికి ఇంత విలువైన విగ్రహాన్ని తయారుచేసి ఆవిష్కరించారు. మరి దీని తయారీ ఖర్చును ఎవరు భరించారనేది మాత్రం బయటికి రావడంలేదు.