: మోడీ ర్యాలీకి భారీ సంఖ్యలో రానున్న ఛాయ్ వాలాలు..!
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు చోట్ల భారతీయ జనతా పార్టీ భారీ విజయాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని బీజేపీ నిర్ణయించింది. ఈ మేరకు ఈ నెల 22న ముంబయిలో బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహిస్తోంది. ఈ ర్యాలీలో పాల్గొనాలని పదివేల మంది ఛాయ్ వాలాలను ఆహ్వానిస్తోంది. ఈ మేరకు వారికి ఆహ్వాన పత్రాలను కూడా త్వరలో పంపనున్నట్లు పార్టీ తెలిపింది.
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ... తన తొలి నాళ్లలో టీ అమ్మిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని ఓ సందేశంగా కాంగ్రెస్ పార్టీకి పంపే ఉద్దేశంతో టీ విక్రేతలను పిలుస్తున్నారు. ఒక సాధారణ టీ అమ్మే వ్యక్తి కూడా దేశ ప్రధాని కాగలడన్న సందేశాన్ని కాంగ్రెస్ కు బీజేపీ తెలపాలనుకుంటోంది. అంతేగాక ఇతర రాష్ట్రాల నుంచి పార్టీ కార్యకర్తలు ర్యాలీకి హాజరయ్యేందుకు ఐదు వేల ప్రైవేటు బస్సులు, 20 నుంచి 22 రైళ్లను ఇప్పటికే బుక్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ర్యాలీకి 20 వేల మంది విద్యార్థులు కూడా హాజరు కానున్నారు.