: దేశాధినేతలపై ఆన్ లైన్లో దుమారం రేపిన 'సెల్ఫీ'
'సెల్ఫీ' (స్మార్ట్ ఫోనులో ఎవరి ఫోటోలు వారే తీసుకోవడం)లో టీనేజర్లు పోటీపడుతుంటారు. తమ ఫోటోలు తామే తీసుకుని ఆన్ లైన్లో పెట్టుకుని తెగ మురిసిపోతుంటారు. అయితే దానికి సమయం, సందర్భం ఉంటాయి. తాజాగా అమెరికా, బ్రిటన్, డెన్మార్క్ దేశాధినేతలు ముగ్గురూ నవ్వుతూ 'సెల్ఫీ' తీసుకున్నారు. ఇది ఓ న్యూస్ ఏజెన్సీ కెమెరా మెన్ కంటపడింది దాంతో అతను క్లిక్ మనిపించి ఆన్ లైన్లో పెట్టేశాడు.
ఆ ఫోటో ఇప్పుడు ఆన్ లైన్ లో సంచలనం రేపింది. ఆ ఫోటోలో ఉన్న ముగ్గురిపై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాళ్లు ఫోటోలు తీసుకోవడం తప్పుకాదు కానీ దానికి సమయం, సందర్భం కలిసిరావాలి కదా అని మండిపడుతున్నారు. వీరు ముగ్గురూ నల్లజాతీ సూరీడు.. స్వేచ్ఛాపిపాసి నెల్సన్ మండేలా స్మారక సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. నల్లజాతి యావత్తూ మండేలాను తండ్రిలా భావిస్తుంది.
అలాంటి వ్యక్తి స్మారక సమావేశంలో పాల్గొనే ప్రముఖుల హావభావాలను బంధించేందుకు ఓ ఏజెన్సీకి చెందిన కెమెరామెన్ 500 చిత్రాలు తీసి ఆన్ లైన్లో పెట్టగా ఈ ఫోటోపై విపరీతంగా స్పందనలు వచ్చాయని సదరు ఏజెన్సీ తెలిపింది. కాగా ఈ వ్యవహారంపై ఒబామా కార్యాలయం కానీ, కామెరాన్, హెలె థార్నింగ్ ష్మిట్ కార్యాలయ సిబ్బంది ఇంతవరకూ స్పందించలేదు.