: ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ చచ్చింది.. ఇక బతకదు: జేసీ


సొంత పార్టీ కాంగ్రెస్ పై జేసీ దివాకర్ రెడ్డి రోజుకో రకంగా విమర్శలు చేస్తున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భంగపడ్డ పార్టీ ఇక ఆంధ్రప్రదేశ్ లో కూడా చచ్చిందని.. ఇక బతకదనీ అన్నారు. అటు తెలంగాణ, ఇటు ఏపీ, ఇతర రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ బతికేది లేదన్నారు. తనపై చర్యలు తీసుకోవాలని ఏఐసీసీకి లేఖ రాశానన్న బొత్స వ్యాఖ్యలపై స్పందించిన జేసీ.. తనకంటే ముందు బొత్సపైనే చర్యలకు ఉపక్రమించి సస్పెండ్ చేయాలన్నారు. ముందు బొత్స, కేంద్రంలోని మంత్రులు, ఎంపీలను సస్పెండ్ చేసిన తర్వాత మాట్లాడాలన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ చీపురు తీసుకుని నున్నగా ఊడ్చేసిందని కాంగ్రెస్ పై పరోక్షంగా వ్యాఖ్యానించిన జేసీ.. ఆమ్ ఆద్మీ లాంటి పార్టీ ఆంధ్రప్రదేశ్ లో వస్తే దానిలో చేరేందుకు ఆలోచిస్తానన్నారు.

తాను సోనియాను కించపరచలేదని, అనారోగ్యం కారణంగానే పదవినుంచి తప్పుకోవాలని సోనియాను కోరానని వివరించారు. కాంగ్రెస్ కు భవిష్యత్తు ఉంటుందని తాను అనుకోవడం లేదన్నారు. నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలకు ఎదురు దెబ్బ తగలడం మన దౌర్భాగ్యం కాదా? అని ప్రశ్నించారు. ప్రాంతీయ పార్టీల వల్ల రాష్ట్రం చిన్నాభిన్నం అవుతుందన్నదే తన ఆందోళన అని జేసీ అన్నారు. అంతకుముందు సచివాలయంలో ఉద్యోగులతో కలిసి ఎంపీలు, కేంద్రమంత్రులకు వ్యతిరేకంగా జేసీ నినాదాలు చేశారు.

  • Loading...

More Telugu News