: వాసన ఒకటే అయినా...
మనలో కొందరికి కొన్ని రకాల వాసనలు పడవు. దీనికి కారణం ఒక్కొక్కరి ముక్కు సదరు వాసనలకు ఒక్కో విధంగా స్పందిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. పరిమళాల విషయంలో శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.
ఇప్పుడు మార్కెట్లో బోలెడు రకాలైన పరిమళాలు మనకు లభిస్తున్నాయి. అయితే అవన్నీ కూడా అందరిలో ఒకేవిధమైన భావాన్ని కలిగించలేవట. ఒక్కొక్కరిలో ఒక్కోవిధమైన భావం, అనుభూతి కలుగుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంటే ఒకే రకమైన సువాసనకు ఏ ఇద్దరూ కూడా ఒకేవిధంగా స్పందించరని శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది.
మనిషిలో దాదాపు 400 రకాల ప్రత్యేక సెన్సర్లు ఉంటాయి. వీటిని ఆఘ్రాణశక్తి స్పందనల ప్రోటీన్లు అంటారు. ఇవి సాధారణంగా వివిధ రకాల వాసనల్లోని తేడాను గుర్తించగలుగుతాయి. అయితే ఆయా పరిమళాల తాలూకు గాఢత, నాణ్యతనుబట్టి ఈ ప్రత్యేక ప్రోటీన్లు అనేవి పరిమళాలు, వాసనల సంకేతశ్రేణిని ఎలా అర్థం చేసుకుంటాయి? అనే విషయాన్ని గురించి మరింత లోతైన అధ్యయనం జరగాల్సి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలా వైవిధ్యానికి అమినో ఆమ్లాల శ్రేణి కూడా కొంతమేర దోహదపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.