: దీనివల్ల మార్కులు కూడా తగ్గుతాయట!


మన పిల్లలకు పరీక్షల్లో మార్కులు తగ్గితే ఇక తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. పిల్లలకు పరీక్షల్లో మార్కులు తగ్గితే ప్రస్తుత ఈ పోటీ ప్రపంచంలో ఎలా నెగ్గుకువస్తారోనని వారు తెగ టెన్షన్‌ పడిపోతుంటారు. తమ పిల్లల మార్కులు తగ్గడానికి కారణాలు ఏమనే విషయం గురించి చాలామంది తల్లిదండ్రులు ఆరాలు తీస్తుంటారు. ఇందులో వారు పట్టించుకోని విషయం ఒకటుంది. అదేమంటే సెల్‌ఫోను. మీ పిల్లల చేతిలో మీరు ముచ్చటపడి కొనిచ్చిన సెల్‌ఫోన్‌ గనుక ఉంటే కచ్చితంగా దానివల్లే మీ పిల్లలకు మార్కులు తగ్గుతాయని పరిశోధకులు చెబుతున్నారు.

సెల్‌ఫోన్‌లో ఎక్కువసేపు మాట్లాడడం వల్ల మన ఆరోగ్యానికి కూడా హానికరమని శాస్త్రవేత్తలు ఒకవైపు హెచ్చరిస్తున్నారు. అయితే దీనిపై కచ్చితమైన నిర్ధారణ జరగలేదు. అమెరికాలోని కెంట్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు సెల్‌ఫోన్‌లో ఎక్కువసేపు మాట్లాడే విద్యార్ధులపై చాలా లోతైన అధ్యయనం నిర్వహించారు. వీరి అధ్యయనంలో గంటలతరబడి సెల్‌ఫోన్‌లో కబుర్లు చెప్పే విద్యార్థుల్లో మార్కులు తగ్గుతున్నట్టు తేలింది. ఇలా ఎక్కువసేపు ఫోనులో మాట్లాడే విద్యార్ధుల మానసిక స్థితి, వారు పరీక్షల్లో చూపుతున్న ప్రతిభను శాస్త్రవేత్తలు తమ అధ్యయనంలో భాగంగా పరిశీలించారు. ఇందులో సెల్లుకు బానిసలైన విద్యార్ధులు మాత్రం తీవ్రమైన మానసిక ఆందోళన (యాంగ్జైటీ)తో బాధపడుతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు.

ఇలాంటి విద్యార్ధులంతా కూడా పరీక్షల్లో గ్రేడింగులో వెనుకబడిపోతున్నట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలా ఒత్తిడి, తీవ్రమైన ఆందోళన కారణంగా విద్యార్ధులు జ్ఞాపకశక్తిని కోల్పోతున్నారని, చదువుపై ఏకాగ్రత చూపలేకున్నారని, వారిలో సృజనాత్మకత కూడా సన్నిగిల్లుతున్నట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సెల్లుకు బానిసలైన విద్యార్ధులు ఇలాంటి సమస్యలతో కుంగిపోతున్నట్టు శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధనలో తేలింది. కాబట్టి తల్లిదండ్రులు బాధ్యతగా మీ పిల్లలు ఏం చేస్తున్నారో, ఎంతసేపు ఫోనులో కబుర్లు చెబుతున్నారో కాస్త గమనించుకుంటే వారిని ఇలాంటి ఒత్తిడినుండి తప్పించి, చక్కగా చదువుకునేలాగా ప్రోత్సహిస్తే మంచిది.

  • Loading...

More Telugu News