: కర్ణాటక మునిసిపల్ ఎన్నికలలో హస్తం హవా


కర్ణాటక రాష్ట్రంలోని మునిసిపల్ ఎన్నికలలో అధికార బీజేపీకి చావుదెబ్బ తగిలింది. ప్రతిపక్ష కాంగ్రెస్ బెంగళూరు రూరల్ సహా చాలా వరకు మునిసిపల్ కార్పొరేషన్లు, మునిపాలిటీలలో విజయఢంకా మోగిస్తోంది . ఏడు కార్పొరేషన్లు, 201 మునిసిపాలిటీలకు జరిగిన ఎన్నికల ఫలితాలను ఈ రోజు ఎన్నికల సంఘం ప్రకటించనుంది.

మొత్తం 4976 కౌన్సిల్ స్థానాలకు 3861 స్థానాలలో ఇప్పటి వరకు ఫలితాలు వెల్లడి కాగా, 1564 స్థానాలలో కాంగ్రెస్ విజయం సాధించింది. 765 స్థానాలతో జేడీఎస్ రెండో స్థానంలో నిలవగా.. 710 స్థానాలతో బీజేపీ మూడో స్థానానికి పరిమితమైంది. 

బెంగళూరు రూరల్ లో 71 స్థానాలకుగాను 30 స్థానాలను కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంది. ఇక్కడ జేడీఎస్ 22 స్థానాలను గెలుచుకుంది. రామనగరం, చిత్రదుర్గ, దెవణగెరె, షిమోగా, మైసూర్ చామరాజనగర్, దక్షిణ కన్నడ బీదర్, బీజాపూర్... ఇలా చాలా మునిసిపాలిటీలలో కాంగ్రెస్సే ఆధిక్యంలో ఉంది. కోలార్, చిక్ బళ్లాపూర్, తుమ్కూర్, హస్సాన్, మాండ్య తదితర మునిసిపాలిటీలలో జేడీఎస్ ముందంజలో ఉంది.

ఇక అధికార బేజేపీ చిక్ మగళూరు, కొడగు, బెల్గాం మునిసిపాలిటీలలోనే ఆధిక్యం చూపగలిగింది. ఈ ఏడాదిలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు వీటిని సెమీఫైనల్స్ గా చెప్పవచ్చు. ముఖ్యంగా బీజేపీ నుంచి బయటకు వచ్చి, వేరు పార్టీలు పెట్టుకున్న యడ్డ్యూరప్ప, బీ శ్రీరాములకు నిరాశే ఎదురైంది. శ్రీరాములు ప్రాతినిధ్యం వహిస్తున్న బళ్లారి మునిసిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంది.

35 స్థానాలతో శ్రీరాములు కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంలో నిలిచింది. ఇక కోలార్ లో జేడీఎస్ ఆధిక్యంలో ఉంది. ఇక్కడ కాంగ్రెస్ రెండో స్థానంలో, శ్రీరాములు పార్టీ మూడో స్థానంలో ఉంది. యడ్డ్యూరప్ప స్థాపించిన కర్ణాటక జనతా పార్టీ చిత్రదుర్గ, షిమోగా, తుమ్కూర్, చామరాజనగర్, హస్సాన్, హావేరీ స్థానాలలో మాత్రమే ప్రభావం చూపించింది. 

  • Loading...

More Telugu News