: దేశంలోని 28 రాష్ట్రాలకు లేని నిబంధనలు ఆంధ్రకు ఎందుకు?: చంద్రబాబు


హైదరాబాద్ లో ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నదీ జలాల పంపిణీలో జరుగుతున్న అన్యాయంపై ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. కృష్ణా నదీ జలాల పంపిణీపై వెలువడిన బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పు సరి కాదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ట్రైబ్యునల్ పరిగణనలోకి తీసుకున్న నియమాలు ప్రపంచంలో ఎక్కడా అమలులో లేవని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీలో కూర్చుని ప్రాజెక్టులను ఎలా నడుపుతారని ఆయన కేంద్రాన్ని ప్రశ్నించారు. న్యాయంగా మనకు రావాల్సిన నీటి వనరులకు వేరే రాష్ట్రాలకు కేటాయించారని చెబుతూ, దీనిని అన్యాయమైన చర్యగా ఆయన అభివర్ణించారు.

విభజన జరిగితే ప్రతి చిన్న సమస్య పరిష్కారానికి మనం హస్తిన బాట పట్టాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు. దేశంలోని 28 రాష్ట్రాలకు లేని నిబంధనలు ఆంధ్రప్రదేశ్ కు ఎందుకని ఆయన ప్రశ్నించారు. జీవోఎం ఆంధ్రప్రదేశ్ ను సరిగా అధ్యయనం చేయకుండానే నివేదిక ఇచ్చిందన్నారు. సరైన నివేదిక ఇవ్వని జీవోఎం అంటే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కాదని... గ్యాంగ్ ఆఫ్ మినిస్టర్స్ అని అనుకోవాల్సి వస్తుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు, తప్పుడు నిర్ణయాలపై టీడీపీ తుది వరకు పోరాటం చేస్తుందని చంద్రబాబు చెప్పారు.

  • Loading...

More Telugu News