: హైదరాబాద్ లోని బంగారు గనుల్ని కరిగించి నగరాన్ని అభివృద్ధి చేయలేదు: కావూరి
హైదరాబాద్ నగరం గత పదేళ్లలోనే పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందిందని, హైదరాబాద్ లో ఉన్న బంగారు గనుల్ని కరిగించి అభివృద్ధి చేయలేదని తాను కేంద్రానికి తెలిపానని కావూరి అన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి ఇతర ప్రాంతాల నుంచి నిధులు తెచ్చి ఖర్చుచేశారని, అందుకే అది మహానగరంగా రూపాంతరం చెందిందని ఆయన అన్నారు. హైదరాబాద్ నగరాభివృద్ధిలో రాష్ట్ర ప్రజలందరి పాత్ర ఉందని, అలాంటప్పుడు ఆ ప్రయోజనాలను కొందరికే ఎలా అందజేస్తారని ఆయన ప్రశ్నించినట్టు తెలిపారు.
అదీ కాక ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకత ఏంటంటే రాష్ట్ర అభివృద్ధి అంతా హైదరాబాద్ చుట్టు ప్రక్కల మాత్రమే జరిగిందని తెలిపినట్టు వెల్లడించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన 450 ప్రభుత్వ సంస్థలు హైదరాబాద్ లోనే నెలకొల్పబడి ఉన్నాయని అన్నారు. కోస్తాలో వచ్చే తుపానులకు సంబంధించిన కేంద్ర కార్యాలయం హైదరాబాద్ లోనే ఉందని, తీర ప్రాంతాల్లో వచ్చే సునామీల కార్యాలయం హైదరాబాద్ లోనే ఉందని, చేపలు కోస్తాలో అధికంగా దొరికితే వాటికి సంబంధించిన కార్యాలయం కూడా హైదరాబాద్ లోనే ఉంది అన్నారు.
పంటలకు సంబంధించిన ప్రతి కార్యాలయం హైదరాబాద్ లోనే కేంద్రీకృతమై ఉందని ఆయన గుర్తు చేశారు. సీమాంధ్ర మొత్తం వ్యవసాయం మీదే ఆధారపడి ఉందని తెలిపిన ఆయన, పరిశ్రమల ద్వారా వచ్చే ఆదాయాన్ని వ్యవసాయాధారిత ఆదాయంతో సరి పోల్చలేమన్నారు. 50 వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చే ఐటీ పరిశ్రమ, సిని, టూరిజం, హెల్త్ కేర్, విద్యా, రంగాలన్నీ హైదరాబాద్ లోనే ఉన్నాయని ఆయన తెలిపారు.