: రాష్ట్రంలో పరిస్థితులను పోలీస్ శాఖ సమర్ధంగా ఎదుర్కొంది: డీజీపీ ప్రసాదరావు
నాలుగైదు సంవత్సరాల నుంచి రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న ఆందోళనలు, ఉద్యమాల నేపథ్యంలో పోలీస్ శాఖ అత్యంత సమర్ధంగా పనిచేసిందని డీజీపీ ప్రసాదరావు పేర్కొన్నారు. అనిశ్చిత పరిస్థితుల్లోనూ జులైలో పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగాయని, పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరగడం పోలీస్ శాఖ పనితీరుకు నిదర్శనమన్నారు. అటు తెలంగాణ, సమైక్యాంద్ర ఉద్యమాల క్రమంలో ఇరు ప్రాంతాల్లో జరిగిన ఆందోళనలను పోలీస్ శాఖ చాకచక్యంగా అదుపు చేసిందన్నారు. ఉద్యమాల అల్లర్ల కేసులో 300 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. విజయనగరంలో జరిగిన ఆందోళనల్లోనూ హింస జరగకుండా పోలీసు శాఖ బాధ్యతలు నిర్వర్తించిందని తెలిపారు. పోలీస్ శాఖ ఏడాది పని తీరుపై డీజీపీ ప్రసాదరావు ఇవాళ మీడియా సమావేశం నిర్వహించారు. ఛత్తీస్ ఘడ్, ఆంధ్రా సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికలను సైతం సమర్ధంగా ఎదుర్కోగలిగామని డీజీపీ చెప్పారు.