: శీతాకాలంలో దీనిని తీసుకుంటే మంచిది!
శీతాకాలంలో మనకు దాహం వేయడం తక్కువ. దీంతో నీరు తక్కువగా తీసుకుంటాం. దీని ఫలితం మన ఆరోగ్యంపై చాలా ప్రభావాన్ని చూపుతుంది. దీనికితోడు నీటికన్నా కూడా కాఫీ, టీలను ఎక్కువగా తీసుకుంటాం. ఎందుకంటే చలిపులి మనల్ని వణికిస్తుంటుంది. దాన్ని పారదోలడానికి కాఫీ, టీలను ఎక్కువగా సేవిస్తుంటాం. దీని ప్రభావం వల్ల మన శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది. ఇలా కాకుండా ఉండాలంటే మన ఆహారంలో కొన్ని చిన్న మార్పులను చేసుకుంటే మంచిది. మన ఆహారంలో సొరకాయను ఎక్కువగా ఉండేలా చూసుకుంటే శరీరం కోల్పోయిన నీటిని అది మన శరీరానికి తిరిగి అందించడానికి ప్రయత్నిస్తుంది.
సొరకాయలో ఎక్కువ శాతం నీరు ఉంటుంది. ఇందులో 92 శాతం నీరు ఉంటే మిగిలిన భాగమంతా పీచే. ఇది తేలికగా జీర్ణమవుతుంది. శీతాకాలంలో మసాలా కూరలంటే ఎక్కువమంది ఇష్టంగా తింటారు. వాటివల్ల మళ్లీ ఇబ్బందులు పడుతుంటారు. ఇలాంటి ఇబ్బందులకు విరుగుడుగా సొరకాయను తింటే మంచిది. సొరకాయలో గ్లూకోజ్, ఇతరత్రా చక్కెరలు ఉండవు. కాబట్టి దీన్ని షుగరు రోగులు చక్కగా ఆహారంలో తీసుకోవచ్చు. ఇది మూత్రపిండాలు, కాలేయానికి సంబంధించిన వాపులను నివారిస్తుంది.