: ఈ 'పిడుగు' పర్యావరణానికి మంచిదే
అదేంటి, పిడుగు పర్యావరణానికి ఎలా మంచిది? అని అనుకుంటున్నారా... ఇక్కడ పిడుగు అంటే నిజం పిడుగు కాదు. అది ఒక బైక్ పేరు. చక్కగా జేమ్స్‌బాండ్ సినిమాల్లోలాగా సూపర్‌గా తయారైన ఒక బైక్ పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించని బైకని దీని తయారీదారులు చెబుతున్నారు. అత్యాధునిక బైక్‌లాగా కనిపించే ఈ కొత్త బైక్ నూటికి నూరుశాతం పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ బైక్. అన్నట్టు దీని పేరు ఏమంటే 'సయ్యట్టా ఆర్' అంటే ఇటలీ భాషలో థండర్‌బోల్ట్ (పిడుగు) అని అర్థం.
బ్రిటన్‌కు చెందిన ఎజిలిటీ గ్లోబల్ సంస్థ దీన్ని తయారుచేసింది. దీని పికప్పే మనకు పిడుగుపాటు వేగాన్ని తలపిస్తుందట. కేవలం 3.9 సెకన్లలోనే గంటకు 96 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే పికప్ సామర్ధ్యం ఈ 'పిడుగు'కు సొంతం. దీనిపై గంటకు 128 కి.మీ. గరిష్ట వేగంతో ప్రయాణించవచ్చు. గంటపాటు దీని బ్యాటరీని ఛార్జింగ్ చేసుకుంటే చాలు. సుమారు 120 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. అన్నట్టు, ఇన్ని సుగుణాలున్న ఈ పిడుగు ధర మన రూపాయల్లో రూ.14 లక్షలే...! అయినా ఈ పిడుగు మన రోడ్లకు సెట్టవుతుందా... అనేదే సందేహంమరి!