: ఆంధ్రా పెన్షన్లు మేమెందుకు చెల్లిస్తాం.. మా రాష్ట్రంలో మేము చెల్లిస్తాం: కేసీఆర్
రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన తెలంగాణకు, ఇతర రాష్ట్రాలకు ఉన్న విధానాలే అమలు జరగాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ ముసాయిదా బిల్లులో జనాభా ప్రాతిపదికన పెన్షన్లు చెల్లించాలని పేర్కొన్నారని, అది తమకు ఏ రకంగానూ అమోద యోగ్యం కాదని స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాలను ఏర్పాటు చేయడం వేరు.. తెలంగాణ ఏర్పాటు వేరు అన్న కేసీఆర్, ముల్కీ రూల్స్ ప్రకారం పెన్షన్లు చెల్లించేందుకు తాము అంగీకరిస్తామన్నారు.
అప్పట్లో ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన జీవో అమలు కాలేదని, దాని ప్రకారం ఇప్పటి ఉద్యోగులకు మాత్రమే తాము చెల్లిస్తామని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షనర్లకు జనాభా ప్రాతిపదికన చెల్లించడానికి తాము ఒప్పుకోమని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రా ప్రాంతంలోని వారి పెన్షన్లను తామెందుకు భరించాలని ఆయన ప్రశ్నించారు. నేటివిటీ ప్రకారం పెన్షనర్లను భరించేందుకు తాము సిద్ధమని ఆయన తెలిపారు. కేంద్రం ప్రతిపాదించిన సూచన అంగీకారం కాదని, అవసరమైతే దానిపై పోరాటం చేస్తామని కేసీఆర్ అన్నారు.