: రగులుతున్న అనంతపురం
పది జిల్లాలతో కూడిన అచ్చమైన తెలంగాణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో, అనంతపురం జిల్లా భగ్గుమంది. సమైక్యాంధ్ర కోసం అలుపులేని పోరాటం చేసిన ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగుల్లో నిరసన జ్యాలలు ఎగసిపడుతున్నాయి. ప్రస్తుతం జిల్లా మొత్తం నివురు గప్పిన నిప్పులా ఉంది. సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక పిలుపు మేరకు జిల్లాలో రెండు రోజుల బంద్ ప్రారంభమైంది. వర్తక, వాణిజ్య సముదాయాలు, విద్యాసంస్థలు, పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. అనంతపురం, హిందూపురంతో పాటు ముఖ్య పట్టణాల్లో రహదారులన్నీ బోసిపోయాయి. జిల్లాలోని 900 ఆర్టీసీ బస్సులు డిపోలను దాటి బయటకు రాలేదు. శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీకి రెండు రోజుల సెలవు ప్రకటించారు. ఏ క్షణంలోనైనా ఆందోళనకారులు విధ్వంసానికి దిగే అవకాశం ఉండటంతో, పోలీసులు అప్రమత్తమయ్యారు. ఒక్క అనంతపురం నగరంలోనే ఆరు కంపెనీల కేంద్ర బలగాలు, ఏపీఎస్పీ బలగాలు మోహరించాయి.