: తెలంగాణలో బంద్ సంపూర్ణం... ప్రశాంతం


రాయల తెలంగాణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ పిలుపునిచ్చిన బంద్ విజయవంతంగా ముగిసింది. తెలంగాణలోని పది జిల్లాల్లో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. హైదరాబాదులో బంద్ సందర్భంగా బస్సులు తిరగలేదు. కోఠి, అబిడ్స్, అమీర్ పేట, కూకట్ పల్లి, గచ్చిబౌలి, దిల్ సుఖ్ నగర్ సహా పలు ప్రాంతాల్లో పోలీసు బలగాలు మోహరించాయి. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో బంద్ ప్రభావం కనిపించలేదు. రైళ్లన్నీ యథావిధిగా నడిచాయి. బస్సులు లేక ఇబ్బంది పడ్డ నగర వాసులకు ఆటోలు, లోకల్ రైళ్లు ప్రత్యామ్నాయంగా కనిపించాయి.

ఖమ్మం జిల్లాలో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. టీఆర్ఎస్ నాయకులు జిల్లాలోని అన్ని డిపోల ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు బంద్ కు సంపూర్ణ మద్దతు పలికాయి. ఆదిలాబాద్ లో బంద్ ప్రశాంతంగా జరిగింది. బొగ్గు గని కార్మికులు విధులకు హాజరు కాకపోవడంతో సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. కరీంనగర్ లోని రెండు డిపోల్లో బస్సులు నిలిచిపోయాయి. సిద్దిపేట ఆర్టీసీ డిపో ఎదుట ఎమ్మెల్యే హరీష్ రావు ధర్నాలో పాల్గొన్నారు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా బస్సులు నడవలేదు. దుకాణాలు, వాణిజ్య సముదాయాలు, విద్యాసంస్థలు మూతబడ్డాయి.

  • Loading...

More Telugu News