: పళ్లు ముత్యాల్లా మెరవాలంటే...!
తమ పళ్లు చక్కగా ముత్యాల్లాగా మిలమిలా మెరిసిపోవాలని అందరూ కోరుకుంటారు. అలాంటి వారు ముఖ్యంగా కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే పళ్లు మిలమిలా మెరిసిపోతుంటాయి. మన ఇంట్లోని బేకింగ్ సోడా మన దంతాలకు చక్కటి మెరుపునిస్తుంది. రాత్రి పడుకునేముందు టూత్‌పేస్టుపై కొద్దిగా బేకింగ్ సోడా చల్లుకుని పళ్లు తోముకుంటే పళ్లమీద మరకలు తొలగిపోతాయి. అయితే కొద్ది మోతాదులోనే వేసుకోవాలి. ఎక్కువగా వేసుకుంటే దంతాలపై ఉండే పూత తొలగిపోయే ప్రమాదం ఉంది.
అలాగే మార్కెట్లో ఇప్పుడు ఎక్కువగా స్ట్రాబెరీలు దొరుకుతున్నాయి. వాటిని బాగా నమిలి తిన్నాకూడా పళ్లు చక్కగా శుభ్రపడతాయి. వాటిలో ఉండే గింజలు దంతాలకు కొత్తరంగును తెచ్చిపెడతాయి. అయితే స్ట్రాబెరీలే తినాలా అని మీరు అనుకోవచ్చు. అవేకాకుండా అసలు గింజలుండే ఎలాంటి పండ్లైనా ఫరవాలేదు. చక్కగా నమిలి తినడం వల్ల పళ్లకు మంచిదని వైద్యులు చెబుతున్నారు.
కొందరు కప్పులకొద్దీ కాఫీ, టీలు లాగించేస్తుంటారు. అలాకాకుండా రోజుకు రెండు సార్లకు మించి కాఫీ, టీలు తీసుకోకుండా ఉండాలి. కాఫీ, టీలవల్ల దంతాలపై మరకలు పడతాయి. దీంతో కొద్దిరోజులకు దంతాలు పసుపు రంగుకు వచ్చేస్తాయి. కూల్‌డ్రింక్స్‌లో ఘాటైన రసాయనాలు ఉంటాయి. వాటివల్ల కూడా మన దంతాలు పాడైపోతాయి. ఒకవేళ వాటిని తీసుకోవాల్సి వస్తే తప్పనిసరిగా స్ట్రా వాడడం వల్ల దంతాలకు తక్కువ హాని కలుగుతుంది. ఇలా కొన్ని చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే దంతాలను చక్కగా మెరిసిపోయేలా ఉంచుకోవచ్చు.