: నిజంగానే చెవిలో చెట్టు మొలిచింది!
ఎవరైనా మనం చెప్పేది వినకుంటే చెప్పేది వినిపించడం లేదా... చెవిలో చెట్లు మొలిచాయా... అంటుంటాం. ఇది మనం ఏదో సరదాకు అన్నా ఒక పాపకు నిజంగానే చెవిలో చెట్టు మొలిచింది. మొలిచిన చెట్టుకి కాస్త పువ్వు కూడా పూసిందట.
చైనాలోని బీజింగ్‌లో టాంర జిల్లాకు చెందిన రాన్రాన్ అనే 16 నెలల పాప నాలుగు నెలలుగా తీవ్ర చెవిపోటుతో బాధపడుతుండడంతో తల్లిదండ్రులు వైద్యుని వద్దకు పాపను తీసుకెళ్లారు. పాప చెవిని పరీక్షించిన వైద్యులు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే పాప చెవిలో రెండు సెం.మీ. పొడవైన డెండేలియన్ (పాల ముల్లంగి వంటి అడవి మొక్క) మొలిచివుంది. దీన్ని గుర్తించిన వైద్యులు ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు. ఈ మొక్క పాప చెవి కెనాల్లో వేళ్లూనుకుని ఉంది. దీన్ని ఎలాగోలా ఆపరేషన్ చేసి తొలగించారు. ఏమాత్రం అశ్రద్ధ చేసివున్నా ఆ మొక్క పాప మెదడు కణజాలంలోకి బలంగా వేళ్లూనుకునేదని వైద్యులు చెబుతున్నారు. కొంతకాలం క్రితం తమ కూతురి చెవిలో డెండేలియన్ విత్తనం పడిందని, తాము పెద్దగా పట్టించుకోలేదని దీంతో సమస్య ఇంతవరకూ వచ్చిందని పాప తల్లిదండ్రులు చెబుతున్నారు. చైనాలోనే ఒక మహిళ చెవిలో గూడుకట్టుకుని వున్న ఒక సాలీడును, అలాగే మరో మహిళ చెవిలో మాంసం తినే పురుగులనూ వైద్యులు తొలగించారు.