: మంత్రి బొత్స నివాసం ఎదుట పాలెం ఘటన బాధితుల ధర్నా
మహబూబ్ నగర్ జిల్లా పాలెం వద్ద గతనెల ఇదే రోజున వోల్వో బస్సు దగ్ధమైన ఘటన చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఇంతవరకు ఘటనకు కారణమైన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవటాన్ని నిరసిస్తూ మృతుల కుటుంబ సభ్యులు, హైదరాబాదులోని మంత్రుల నివాస ప్రాంగణంలో ఉన్న రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నివాసం ఎదుట ధర్నా చేస్తున్నారు. బొత్స రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని, వెంటనే పరిహారం అందించాలని, బస్సు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బొత్స నివాసాన్ని ముట్టడించేందుకు బాధిత కుటుంబాలు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దాంతో, ఇక్కడ తీవ్ర ఉద్రికత్తత చోటు చేసుకుంది. ప్రస్తుతం బాధితుల ఆందోళన కొనసాగుతోంది.