: షుగరు రోగులకు తియ్యటి వార్త
షుగరు రోగులకు కడుపు నిండా తినడం మంచిదికాదు. దీంతో చాలామంది షుగరు రోగులు ఒకేసారి కడుపునిండా తినడంకన్నా పదే పదే కొద్ది మోతాదులో ఆహారం తీసుకుంటూ ఉంటారు. ఇలా పలుమార్లు ఆహారం తీసుకోవడం కూడా కొందరికి విసుగు అనిపిస్తుంది. ఇలాంటి వారు చక్కగా కడుపునిండా ఆహారం తీసుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. పలు పర్యాయాలు ఆహారం తీసుకోవడంకన్నా కూడా ఒకేసారి కడుపునిండా భోజనం చేస్తే షుగరు రోగులకు మంచిదని పరిశోధకులు చెబుతున్నారు.
స్వీడన్‌లోని లింకోపింగ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో షుగరు రోగులు పదే పదే తినడంకన్నా ఒకేసారి కడుపునిండా భోజనం చేస్తే మంచిదని తేలింది. పరిశోధకులు టైప్-2 డయాబెటిస్తో బాధపడేవారిలో ఆహారం తిన్న తర్వాత రక్తంలోని చక్కెర, కొవ్వు పదార్థాలు, వివిధ హార్మోన్ల స్థాయిని తెలుసుకోవడానికి పరిశోధనలు నిర్వహించారు. ఇందుకోసం పరిశోధకులు షుగరు రోగులకు మూడు రకాల ఆహార పదార్ధాలను అందించారు. ఒకటి తక్కువ కొవ్వు (లో ఫ్యాట్), రెండవది లో కార్బొహైడ్రేట్లు ఉండేది, మూడవది మెడిటరేనియన్ (పచ్చి కూరలు, పండ్లు, తృణధాన్యాలు మొదలైనవి) డైట్‌ని అందించారు. తర్వాత నిర్వహించిన పరీక్షల్లో మెడిటరేనియన్ ఆహారం ద్వారా వచ్చే శక్తి మిగతా రెండు రకాల ఆహారాలతో పోలిస్తే మధ్యస్థంగా ఉందని పరిశోధకులు గుర్తించారు. లోఫ్యాట్ డైట్‌తో పోలిస్తే కార్బొహైడ్రేట్స్‌తో కూడిన డైట్ వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగాయని, ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలు మాత్రం ఎక్కువగా ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు.