: భారత బ్యాటింగ్ ముందు భారీ లక్ష్యాలు చిన్నబోతున్నాయి: రణతుంగ
భారత బ్యాటింగ్ ఆర్డర్ ముందు ఎంతటి భారీ లక్ష్యాలైనా చిన్నబోతున్నాయని శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ అన్నారు. ప్రస్తుతం భారత జట్టులోని టాపార్డర్ లో ఆరుగురు ఆటగాళ్లు గెలుపులో కీలక పాత్ర పోషిస్తుండటంతో భారీ లక్ష్యాలు కూడా చిన్నబోతున్నాయని తెలిపారు. ఈ మధ్య భారత జట్టు చేధించిన లక్ష్యాలను చూస్తే టీమిండియా బ్యాటింగ్ ఎంత బలంగా ఉందో తెలుస్తుందని అభినందించారు.
రోహిత్ శర్మను మిడిల్ ఆర్డర్ నుంచి ఓపెనర్ గా తీసుకురావడంతో టీమిండియా బలం అమాంతం పెరిగిందని అర్జున అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం టీమిండియా యువ రక్తంతో మరిగిపోతోందని, అన్ని ఫార్మాట్లలో విశేషంగా రాణిస్తూ అభినందనలు అందుకుంటోందని అన్నారు. భారత దిగ్గజాలు వీవీఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్ లు జట్టు నుంచి నిష్క్రమించాక కుర్రాళ్లు ఆ లోటు జట్టుమీద పడకుండా కష్టపడుతున్నారని శ్రీలంక దిగ్గజ కెప్టెన్ రణతుంగ అభినందించారు.