: అంతరిక్ష కూరగాయలు రానున్నాయి!
అంతరిక్ష కూరగాయలు ఏంటి... అని అనుమానంగా ఉందా... అంతరిక్ష కూరగాయలు అంటే అంతరిక్షంలో పండించిన కూరగాయలు. ఇలాంటివి మరో రెండేళ్లకు వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అంతరిక్షంలో కూరగాయల సాగు చేయాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ మేరకు ప్రయోగాలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
అమెరికా అంతరిక్ష సంస్థ నాసా 2015 నాటికి చందమామపై కూరగాయలను పండించాలని నిర్ణయించింది. దీనికి ప్రత్యేక ప్రయత్నాలను కూడా చేస్తోంది. కాఫీపొడి డబ్బా పరిమాణంలో ఉండే సీల్డ్ కంటైనర్లలో విత్తనాలను చందమామపైకి పంపుతారు. వాణిజ్య సంస్థలు ప్రయోగించే ల్యాండర్లలో వీటిని ఉంచుతారు. చందమామపైన ఉండే ప్రమాదకరమైన వాతావరణాన్ని తట్టుకుని నిలబడేలా ఈ కంటైనర్లను రూపొందిస్తారు.
ఐదు నుండి పదిరోజుల పాటు మొక్క వృద్ధికి వీలు కల్పించేలా చాలా తేలికైన సీల్డు చాంబర్లను వృద్ధి చేయాలన్నది మా లక్ష్యమని నాసా తెలిపింది. అంతేకాదు మొక్కల పెరుగుదల తీరును ఎప్పటికప్పుడు గమనించేందుకు అక్కడ కెమెరాలను, సెన్సర్లను, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అమరుస్తారు. అక్కడ ముందుగా టర్నిప్, తులసి వంటి మొక్కలను పెంచాలని నాసా భావిస్తోంది.