: ఐపీఎస్ అధికారి తేజ్ దీప్ కౌర్ పై విచారణకు ప్రభుత్వం అనుమతి
సీనియర్ ఐపీఎస్ అధికారి తేజ్ దీప్ కౌర్ కు ఊహించని పరిణామం ఎదురైంది. తేజ్ దీప్ కౌర్ పై ఏసీబీ విచారణకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తేజ్ దీప్ గతంలో తూనికలు, కొలతల శాఖలో పనిచేస్తున్నప్పుడు సిబ్బంది బదిలీల్లో పెద్ద మొత్తంలో లంచాలు తీసుకున్నారని ఆమెపై ఆరోపణలున్నాయి. ఈ వివాదం గత ఐదేళ్ల నుంచి నలుగుతోంది. గతంలోనే ఏసీబీ అధికారులు ఈ కేసును విచారించారు. అప్పట్లో లీగల్ మెట్రాలజీ కంట్రోలర్ రాంకుమార్ ను ఏసీబీ అధికారులు విచారించగా... తేజ్ దీప్ ఆదేశాల మేరకే డబ్బు వసూలుచేశానంటూ ఆయన వెల్లడించారు. దీంతో తేజ్ దీప్ ను విచారించేందుకు అనుమతినివ్వాలని ఏసీబీ పలుమార్లు ప్రభుత్వాన్ని కోరింది. ఇన్ని రోజుల తర్వాత ఈ రోజు విచారణకు అనుమతినిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది.