: అక్కడ దమ్ము కొడితే అన్నం పెట్టరు!
దమ్ము కొట్టడం మానండి బాబూ... అంటూ ఎంత మెత్తగా చెప్పినా పొగరాయుళ్ల చెవికి ఎక్కడం లేదు. దీంతో తమ వద్దకు వచ్చే వారి జీవిత కాలాన్ని కొంతకాలం పాటు పెంచాలని భావించిన హోటల్ యజమానులు తమ వద్దకు వచ్చేవారు పొగతాగితే వారికి ఆహారం పెట్టకుండా చూడాలని నిర్ణయించుకున్నారు. అంతటితో ఆగకుండా ఈ నిర్ణయాన్ని రాష్ట్రంలోని అన్ని హోటళ్లలోనూ అమలు పరిచేలా ఆదేశాలను కూడా అందించుకున్నారు.
కేరళలో చక్కటి వంటకాలతో వచ్చిన వారికి కమ్మటి భోజనాన్ని పెట్టే హోటల్ పరిశ్రమ తమ వద్దకు వచ్చేవారి ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని ఒక ప్రత్యేక నిర్ణయాన్ని తీసుకుంది. అదేమంటే కేరళలోని హోటళ్లు, రెస్టారెంట్లలో పొగతాగడాన్ని నిషేధించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకుంది. ఇలా పొగతాగే వారి ఆరోగ్యాలు పాడుకావడంతోబాటు ఆ పొగతాగే వారి పక్కనున్న వారి ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి తమ వద్ద పనిచేసే ఉద్యోగులు, అలాగే తమ ఖాతాదారుల ఆరోగ్యాలను కాపాడేందుకు వీలుగా హోటళ్లు, రెస్టారెంట్లలో పొగతాగడాన్ని నిషేధిస్తూ హోటల్ పరిశ్రమ నిర్ణయం తీసుకుంది.
ఈ నిర్ణయాన్ని అనుసరించి కేరళ హోటళ్లు, రెస్టారెంట్ల సంఘం, దక్షిణ భారత హోటళ్లు, రెస్టారెంట్ల సంఘం, దక్షిణ కేరళ హోటల్ నిర్వాహకుల వేదికలకు చెందిన పదాధికారులు, ప్రతినిధులు కూడా తమ తమ హోటళ్లలో పొగతాగడాన్ని నిషేధిస్తూ నోటీసులు పెట్టేందుకు అంగీకరించారు. పొగతాగడం వల్ల, వారికేకాదు వారి పక్కనుండే వారికి కూడా 250 రకాల హానికారక రసాయనాలు ఊపిరితిత్తుల క్యాన్సర్కు, గుండెపోటుకు దారితీస్తాయి, అలాగే చిన్న పిల్లల్లో తీవ్రమైన ఆస్తమా, ఇతర ఆరోగ్య పరమైన సమస్యలు కూడా తలెత్తుతాయి. కాబట్టి తమ వద్దకు వచ్చే మహిళలు, చిన్న పిల్లలు సహా తమ పోషకులు ముఖ్యమని, అలాగే తమవద్ద పనిచేసే ఉద్యోగుల ఆరోగ్యం కూడా తమకు ముఖ్యమేనని కాబట్టే ఇకపై హోటల్ ఆవరణలో ఉద్యోగులు, ఖాతాదారులు ఎవరూ కూడా పొగతాగకుండా చూస్తామని కేరళ హోటళ్లు, రెస్టారెంట్ల సంఘం అధ్యక్షుడు చెబుతున్నారు.