: ఈ పాలైనా ఫరవాలేదట
రోజు రోజుకూ పాల ఉత్పత్తులకు డిమాండ్ పెరిగిపోతోంది. దీంతో ఏ జంతువు పాలల్లో మన ఆరోగ్యానికి మేలు కలిగేలా కొవ్వు పదార్థాలు ఉంటాయి? ఎలాంటి ప్రోటీన్లు ఉంటాయి? అనే విషయంలో శాస్త్రవేత్తలు పలు జంతువులపై పరిశోధనలు సాగిస్తున్నారు. ఈ పరిశోధనల నేపధ్యంలో ఇప్పటికే ఆవుపాలు, గేదె పాలు, మేకపాలు ఇలా కొన్ని రకాలైన జంతువుల పాలు తాగడం వల్ల చక్కగా ఆరోగ్యంగా ఉండవచ్చని మనందరికీ తెలుసు. కొన్ని ప్రాంతాల్లో ఒంటె పాలను కూడా వినియోగిస్తున్నారు. తాజాగా శాస్త్రవేత్తలు అడవి దుప్పి పాలల్లో కూడా మన ఆరోగ్యానికి మేలు చేసే ప్రోటీన్లు, కొవ్వు పదార్ధాలు ఉన్నాయని కనుగొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా పాలు, పాల ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్ నేపధ్యంలో కేవలం ఆవు, గేదె, మేక వంటి జంతువుల పాలే కాకుండా ఇతర పాడిజీవులపైన కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఐక్యరాజ్యసమితి ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఎ.ఒ) పిలుపునిచ్చింది. ప్రస్తుతం పాలకు, పాల ఉత్పత్తులకు ఉన్న డిమాండ్కన్నా 2025 నాటికి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మరో 25 శాతం డిమాండ్ పెరుగుతుందని, దీంతో చాలామంది పేద ప్రజలకు పౌష్టికాహారం అందించే పాల ఉత్పత్తులు అందుబాటులో ఉండడం కష్టంకావచ్చని, కాబట్టి ప్రత్యామ్నాయ పాడి పశువుల గురించి ఆలోచించాల్సి ఉందని ఎఫ్.ఎ.ఒ చెబుతోంది.
ఇప్పటికే ఇథియోపియా, రష్యా, మాలి, సోమాలియా వంటిచోట్ల ఒంటె పాలను వినియోగిస్తున్నారు. అలాగే అడవిదుప్పి లాంటి వాటి పాలల్లో ప్రోటీన్లు, కొవ్వు పదార్ధాలు ఎక్కువగా ఉంటాయని, లాక్టోస్ మాత్రం ఆవుపాలకంటే సగం తక్కువ ఉంటుందని, లాక్టోస్ పడనివారికి అడవి దుప్పి పాలు ప్రత్యామ్నాయం అవుతుందని ఎఫ్.ఎ.ఒ తన నివేదికలో పేర్కొంది.