: పాక్ ప్రధానికి సహకరించం: అజ్మీర్ దర్గా ఆధ్యాత్మిక గురువు
రాజస్థాన్ లోని అజ్మీర్ దర్గా.. ముస్లింలకు పవిత్రమైన క్షేత్రం. అక్కడికి పేద, ధనిక తేడా లేకుండా అందరూ వస్తుంటారు. ఇప్పుడక్కడికి సాక్షాత్తూ పాకిస్తాన్ ప్రధాని రానున్నాడు. అయితే సరిహద్దుల్లో పాక్ సైనికులు కిరాతకంగా భారత సైనికుల తలలు తెగనరకడం.. అజ్మీర్ దర్గాలో భక్తుల ప్రార్థనలు అల్లాకు నివేదించే ఓ ఆధ్యాత్మిక గురువులో అగ్నిజ్వాలలు రగిల్చింది.
తన దర్గా వద్దకు వచ్చేది ప్రధాని అయితేనేం, మరెవరైతేనేం తన సోదరసమానులకు జరిగిన ఆకృత్యానికి బదులుగా పాక్ ప్రధానికి ప్రార్థనల్లో సహకరించకూడదని ప్రతిన బూనాడు. ఓ దేశ ప్రధానికి సహాయ నిరాకరణ చేస్తానని ధైర్యంగా చెబుతూ, నిజమైన భారతీయతకు మతాలు అడ్డురావని ఘనంగా చాటాడీ ఆధ్యాత్మిక గురువు. పాక్ ప్రధాని రేపు భారత్ రానున్న నేపథ్యంలో ఈ మత గురువు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఆ ఆధ్యాత్మిక గురువు పేరు జైనుల్ అబెదిన్ అలీ ఖాన్. అసలు పాక్ ప్రధాని ఇక్కడికెందుకు వస్తున్నాడో అర్థంకావడం లేదన్న అలీ ఖాన్.. పాక్ ప్రధానికి సహకరిస్తే, ఇటీవల పాక్ సైనికుల చేతిలో హతమైన భారత సైనికుల కుటుంబాలను అగౌరవపరిచినట్టే అని అభిప్రాయపడ్డారు. కాగా, పాక్ ప్రధానికి కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షీద్ ఆతిథ్యం ఇవ్వనున్నారు. అయితే వీరిద్దరి మధ్య చర్చలు జరిగే విషయం ఇంకా ఖరారు కాలేదు.