: బీరులో నురగెలా వస్తుందంటే...
మామూలుగా బీరు సీసాను తెరవగానే బుస్సుమని నురుగ పొంగుతుంది. దీనికి కారణం ఏంటా? అని శాస్త్రవేత్తలు అన్వేషించారు. చివరికి నురగలు రావడానికి కారణాన్ని కనుగొన్నారు. కేవిటేషన్ అనే ప్రక్రియ ఆధారంగానే బీరు సీసాల్లో నురుగ పొంగుతుందని శాస్త్రవేత్తలు చివరికి గుర్తించారు.
స్పెయిన్‌లోని కార్లోస్3 విశ్వవిద్యాలయం, మరో ఫ్రాన్స్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు బీరు సీసా మూత తెరవగానే నురుగ పొంగడం వెనుకున్న కారణాన్ని గుర్తించారు. కేవిటేషన్ ప్రక్రియ ఆధారంగానే బీరు సీసాల్లో నురగ పొంగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నౌక ప్రొపెల్లర్ల ఒరిపిడి ప్రక్రియను ఆధారంగా చేసుకుని తాము ఈ విషయాన్ని గుర్తించామని ఈ పరిశోదనలో పాలుపంచుకున్న జేవియర్ రోడ్రిగ్వెజ్-రోడ్రిగ్వెజ్ చెబుతున్నారు. ప్రొపెల్లర్ల తరహాలోనే బీరువంటి ద్రవంలో నురగలు ఏర్పడతాయని, బీరు సీసా మూత వెనక ఒక్కసారిగా ఆకస్మిక ప్రభావం సంభవించినప్పుడు ముందూ వెనుకా పీడనంతో కూడిన కదలికలు ఏర్పడి, అవి విస్తృతి తరంగాలుగా మారి వేగంగా బుడగలను ఆవిర్భవింపజేసి అంతే త్వరగా క్షీణిస్తాయని రోడ్రిగ్వెజ్ తెలిపారు.
అయితే ఈ ప్రక్రియలో పెద్దపెద్ద తల్లి బుడగలు కార్బోనిక్ గ్యాస్‌తో కూడిన చిన్న పిల్ల బుడగల మేఘాలను పుట్టిస్తాయని, ఇవి వేగంగా విస్తరించి చిన్న పిల్లబుడగల నురగకు దారితీస్తాయని తెలిపారు. పెద్ద బుడగలు ఏర్పడే రీతినిబట్టి నురగ స్థాయి ఉంటుందని, పెద్ద పేలుడు తర్వాత కనిపించే పుట్టగొడుగు తరహా ఆకృతిలో బుడగలతో కూడిన నురగ పొంగుతుందని రోడ్రిగ్వెజ్ వివరించారు.