: రైలులో యువకుల అనుచిత ప్రవర్తన.. సస్పెండ్ అయిన ఐదుగురు జీఆర్పీ కానిస్టేబుళ్లు
జార్ఖాండ్ లోని ధన్ బాద్ లోని ఒక పాఠశాల విద్యార్థినులు పాట్నా నుంచి తిరిగి తమ ఊరికి రైలులో వెళ్తుండగా.. కొందరు యువకులు వారి బెర్తులను బలవంతంగా ఆక్రమించడంతో పాటు.. వారి పట్ల అనుచితంగా వ్యవహరించడంపై దర్యాప్తు జరిపించాలని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అధికారులను ఆదేశించారు. పాట్నాలోని పర్యావరణ శిబిరానికి హాజరైన విద్యార్థినులు శనివారం రాత్రి రైలులో తిరిగి స్వస్థలాలకు వెళ్తుండగా వారికి చెందిన 34 బెర్తులను కొందరు యువకులు ఆక్రమించుకున్నారు. దీనిపై పాఠశాల నిర్వాహకులు రైల్వే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రైల్వే ఉన్నతాధికారులను ఆదేశించారు. దీంతో ఆ సమయంలో విధినిర్వహణలో ఉన్న ఐదుగురు ప్రభుత్వ రైల్వే పోలీసుల(జీఆర్పీ)ను సస్పెండ్ చేశారు.