: పెను తుపానుగా మారిన 'లెహర్'
కోస్తాంధ్రపై ప్రకృతి పగపట్టింది. వరుస తుపాన్లతో కోస్తా తీరంపై విరుచుకుపడుతోంది. మొన్న ఫైలిన్, నిన్న హెలెన్, ఇప్పుడు లెహర్... ఇలా వరుసబెట్టి కోస్తాంధ్రను అతలాకుతలం చేస్తున్నాయి. లెహర్ తుపాను పెను తుపానుగా మారిందని విశాఖ వాతావరణ హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఇది ఈ నెల 28న మచిలీపట్నం, కళింగపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ప్రస్తుతం లెహర్ మచిలీపట్నానికి తూర్పు-ఆగ్నేయ దిశలో 1300 కిలోమీటర్లు, కాకినాడకు తూర్పు-ఆగ్నేయంగా 1230 కిలోమీటర్లు, కళింగపట్నానికి 1140 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ తెలిపింది.
ప్రస్తుతానికి లెహర్ తుపాను 15 కిలోమీటర్ల వేగంతో కదులుతోందని, రానున్న 18 గంటల్లో అండమాన్-నికోబార్ దీవుల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇది మన కోస్తా తీరాన్ని సమీపించే కొద్దీ మరింత తీవ్రంగా మారుతుందని స్పష్టం చేసింది. సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. భారత వాతావరణ శాఖ రెడ్ మెసేజ్ జారీ చేసింది. ఇది గత రెండు తుపానుల కంటే మరింత తీవ్రమైనదని హెచ్చరించింది.