: ఊపిరి తీసుకోవడం మరచిపోతున్నారట!
ఊపిరి తీసుకోవడం మరచిపోవడం ఏంటి, చోద్యం కాకపోతే, అని మీరు అనుకుంటున్నారేమో కానీ కొందరు నిజంగానే ఊపిరి తీసుకోవడం మరచిపోతున్నారట. ఇది క్రమేపీ ఒక జబ్బుగా పరిణమిస్తోందట. మనం ఎక్కువగా పనిలో మునిగివుంటే ఊపిరి సలపనంత పనిలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నామని చెబుతుంటాం. ఇది ఉత్తినే చెప్పినా నిజంగానే కొందరు మాత్రం పనిలో ఉన్న సమయంలో ఊపిరి తీసుకోవడం కూడా మరచిపోతున్నారని తేలింది. అంటే శ్వాస తీసుకోవడం మామూలు వేగంగా కాకుండా తక్కువ వేగంతో శ్వాస తీసుకుంటున్నారట. దీనికి ఇ- మెయిల్ అప్నోయా అనే పేరు కూడా పెట్టేశారట.
ముఖ్యంగా కంప్యూటర్ల ముందు కూర్చుని పనిచేసేవారు ముఖ్యమైన డాక్యుమెంట్లు కంపోజ్ చేస్తున్నా, లేదా ఇ-మెయిల్ చూస్తున్నా ఇలా ఏదైనా ముఖ్యమైన పనిచేస్తున్న సమయంలో 80 శాతం మంది శ్వాస తీసుకోవడం కూడా మరచిపోతున్నారట. సాధారణంగా మనిషి నిమిషానికి 18 సార్లు శ్వాస తీసుకోవాల్సి ఉంటుంది. అయితే కంప్యూటరుపై కంపోజింగ్ పనిలో ఉన్న సమయంలో చాలామంది పనిమీదే దృష్టి పెట్టి తక్కువసార్లు శ్వాస తీసుకుంటారు. దీనిఫలితంగా తీవ్రమైన అనారోగ్య సమస్యలను ఎదుర్కొనాల్సి ఉంటుంది. హృదయ స్పందనల మీద కూడా దీనిప్రభావం ఉంటుంది. ఇలా తక్కువ శ్వాస తీసుకోవడం వల్ల ఆ ప్రభావం నరాలపై కూడా పడుతుందట.
ప్రస్తుతం ప్రపంచంలో కంప్యూటర్లముందు పనిచేసే వారిలో 80 శాతం మంది ఈ-మెయిల్ అప్నోయా ప్రభావానికి గురవుతున్నారట. మరో ముఖ్య విషయం ఏమంటే ఈ ప్రభావానికి గురైన వారికి తాము తక్కువ శ్వాస తీసుకుంటున్నామనే విషయం కూడా తెలియదట. కాబట్టి కంప్యూటర్లముందు పనిచేసేవారు తాము ఎన్నిసార్లు శ్వాస తీసుకుంటున్నామనే విషయాన్ని కూడా అప్పుడప్పుడూ పరిశీలించుకుని తగు శ్వాస తీసుకుని ఆరోగ్యంగా ఉండండి.