: భారత్, విండీస్ తొలి వన్డే నేడే.. పొంచి ఉన్న వరుణుడు


భారత్, వెస్టిండీస్ మధ్య కోచిలో ఈ రోజు తొలి వన్డే జరగనుంది. ఈ డే నైట్ మ్యాచ్ మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమవుతుంది. సచిన్ శకం పూర్తిగా ముగిసిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి మ్యాచ్ ఇది. కోల్ కతా, ముంబైలలో జరిగిన టెస్ట్ మ్యాచ్ లలో నిరాశపరచిన విండీస్ జట్టు వన్డే ఫార్మాట్ లో ఎలా రాణిస్తుందనేది ఇప్పుడు అందరూ ఆలోచిస్తున్న అంశం. అత్యంత పటిష్ఠమైన భారత్ బ్యాటింగ్ లైనప్ ను విండీస్ బౌలర్లు ఏ మేరకు కట్టడి చేస్తారనేది వేచి చూడాల్సిన అంశం. టెస్టులతో పోలిస్తే వన్డేలో విండీస్ జట్టును కొంత బలమైన జట్టుగానే అంచనావేయొచ్చు.

భారత్ విషయానికొస్తే, యువరాజ్, రైనా, జడేజా, అంబటి రాయుడు, అమిత్ మిశ్రా, ఉనద్కత్, ధవల్, మోహిత్ లు జట్టుతో కలిశారు. టెస్టుల్లో అదరగొట్టిన పేసర్ షమీ వన్డేలో ఆడటం ఖాయంగా కనిపిస్తోంది. రాయుడుకి తుది జట్టులో స్థానం దక్కడం అనుమానమే. ఆస్ట్రేలియా సిరీస్ లో అదరగొట్టిన రోహిత్, ధావన్, కోహ్లీ మరో సారి విరుచుకుపడతారనడంలో సందేహం లేదు. మిడిలార్డర్ లో యువరాజ్, రైనా, జడేజా, ధోనీ కీలకపాత్ర పోషించాల్సిన అవసరం ఉంది.

విండీస్ విషయానికొస్తే, స్యామి స్థానంలో డ్వేన్ బ్రావో సారథ్య బాధ్యతలు నిర్వహించనున్నాడు. డ్వేన్ బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లో కీలక పాత్ర పోషించగల సామర్థ్యం గలవాడు. గేల్, డారెన్ బ్రావో, స్యామిలు ధాటిగా పరుగులు రాబట్టడంలో స్పెషలిస్టులుగా గుర్తింపుపొందారు. దీనికితోడు, చార్లెస్, సిమన్స్ కీలకమైన పరుగులు రాబట్టడంలో సిద్ధహస్తులు. బౌలింగ్ విభాగానికొస్తే, సునీల్ నరైన్ చాలా ప్రమాదకారిగా మారాడు. ఇతనికి తోడు రవి రాంపాల్, హోల్డర్ లు పేస్ విభాగంలో తమదైన ముద్ర వేయగలరు. అయితే, వీరందరి బౌలింగ్ ను ఎదుర్కొన్న అనుభవం మన బ్యాట్స్ మెన్ కు ఉంది.

అయితే, కోచికి వరుణుడి ముప్పు కూడా పొంచి ఉంది. ఈ రోజు అప్పుడప్పుడు వర్షం కురిసే అవకాశాలున్నాయి. దీంతో, మ్యాచ్ ఏ మేరకు కొనసాగుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇటీవలి వర్షాలకు పిచ్, మైదానం తడిసిపోవడంతో... వికెట్ బౌలర్లకు అనుకూలించవచ్చని పిచ్ క్యూరేటర్ తెలిపాడు.

  • Loading...

More Telugu News