: భారత్-అమెరికా సంబంధాల పటిష్ఠతకు రిపబ్లికన్ల బాసట
భారత్-అమెరికా సంబంధాల పటిష్ఠతకు తమవంతు కృషి చేస్తామని రిపబ్లికన్ పార్టీ నేతలు హామీ ఇచ్చారు. అమెరికాలో భారత సంతతి వారి ప్రయోజనాలను కాపాడతామన్నారు. వాషింగ్టన్ లో జరిగిన సమావేశానికి రిపబ్లికన్ పార్టీకి చెందిన అగ్రనేతలతోపాటు రెండు డజన్లకు పైగా చట్టసభల సభ్యులు పాల్గొన్నారు. దీనికి అమెరికాలోని పలు ప్రాంతాల నుంచి 200 మంది భారతీయ అమెరికన్లు హాజరయ్యారు. ఇలాంటి సమావేశం జరగడం ఇదే మొదటి సారి.
భారత సంతతికి చెందిన దక్షిణ కరోలినా గవర్నర్ నిక్కీ హాలీ సమావేశాన్ని ఉద్దేశించి వీడియో సందేశం వినిపించారు. తన ఘనమైన భారతీయ వారసత్వం పట్ల గర్విస్తున్నానని చెప్పారు. ముఖ్యంగా డెమొక్రటిక్ పార్టీవైపున్న భారత సంతతి ప్రజలను తమవైపునకు తిప్పుకునేందుకు రిపబ్లికన్లు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
భారత్, అమెరికాలు ఇంకా ఇంకా కలిసి పనిచేయాలని కాంగ్రెస్ సభ్యుడు, విదేశీ సంబంధాల కమిటీ చైర్మన్ ఎడ్ రాయిస్ ఆశించారు. ఎన్ని విషయాల్లో భారత్, అమెరికాల మధ్య పోలిక ఉందో గుర్తించామని.. ఈ మేరకు తమ విదేశీ విధానంపై దృష్టి పెడతామని చెప్పారు. ఈ సమావేశంలో హౌస్ మెజారిటీ నేత ఎరిక్ కాంటర్ మాట్లాడుతూ.. అమెరికాలో భారత సంతతివారి కృషిని ప్రశంసించారు.