: కాకరతో ఎన్ని లాభాలో
కాకర కాయతో బోలెడు లాభాలున్నాయి. చూసేందుకు రూపం అంత అందంగా ఉండదు, రుచి కూడా చాలా చేదుగా ఉంటుంది కానీ, కాకరలో ఉండే సుగుణాలు చెప్పాలంటే చాలా ఎక్కువే. రూపం, రుచి కారణంగా కాకరని తినడానికి చాలామంది ముఖం చిట్లిస్తుంటారు. కానీ దీని సుగుణాల గురించి చెబితే అప్పుడు తప్పక తింటారేమో. కాకరతో షుగరును అదుపులో ఉంచవచ్చని ఎప్పటినుండో చెబుతున్నారు. ఇప్పుడు క్యాన్సర్‌ను కంట్రోల్ చేయడానికి కూడా కాకర చక్కగా ఉపకరిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.
కాకరలో ఉండే చేదు తల, మెడకు సంబంధించిన క్యాన్సర్లను నివారించేందుకు చక్కగా ఉపకరిస్తుందని తాజా పరిశోధనల్లో తేలింది. సెయింట్ లూయిస్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు, భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త రత్నా రే కలిసి నిర్వహించిన అధ్యయనంలో క్యాన్సర్ చికిత్సలకు కాకర చక్కగా పనిచేస్తుందని తేలింది. భారతదేశంలోను, చైనాలోను వంటకాల్లో ఎక్కువగా కనిపించే కాకర నుండి తీసిన రసం తల, మెడ క్యాన్సర్ కణాల వృద్ధిని తగ్గించినట్టు ఎలుకలపై చేసిన అధ్యయనంలో రే గుర్తించారు. కాకర సారంతో వివిధ రకాల క్యాన్సర్లపై చికిత్స చేసి చూశామని, నియంత్రిత పరిస్థితుల్లో ప్రయోగశాలలో చేపట్టిన అధ్యయనంలో క్యాన్సర్ కణతి వృద్ధిని, కణతుల సంఖ్యను తగ్గించినట్టు తేలిందని రే చెబుతున్నారు. అయితే ఈ విషయంపై మరింతగా అధ్యయనాలు సాగాల్సి ఉందని, ప్రస్తుతం కాకర సారం ఉపయోగించి క్యాన్సర్ల చికిత్సకు సంబంధించిన అవకాశాలను మెరుగుపరచే అవకాశం ఉందని రే చెబుతున్నారు.