: సచిన్ కు ఎందుకు భారతరత్న..? ఆయనేమీ ఉచితంగా ఆడలేదు: జేడీయూ
ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ కు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇవ్వడాన్ని జనతాదళ్ యునైటెడ్ పార్టీ (జేడీయూ) సీనియర్ నేత శివానంద్ తివారీ తీవ్రంగా తప్పుబట్టారు. ఈ అవార్డు ఒక జోక్ గా మారిపోయిందంటూ అభివర్ణించారు. టెండుల్కర్ కంటే ముందు విఖ్యాత హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ కు ఇవ్వాల్సిందన్నారు. భారతరత్న ప్రాధాన్యం కోల్పోయి ఇప్పుడు పెద్ద జోక్ గా మారిందని అభివర్ణించారు. 'టెండుల్కర్ ఉచితంగా దేశం కోసం ఆడలేదు. ఆయన వేలాది కోట్ల రూపాయలు ఆర్జించారు. ధ్యాన్ చంద్ పేరును ఎందుకు భారతరత్న అవార్డు కోసం పరిశీలించలేదు?' అంటూ శివానంద్ తివారీ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ధ్యాన్ చంద్ పేరును 82 మంది పార్లమెంటు సభ్యులు లోగడే ప్రతిపాదించిన విషయాన్ని తివారీ గుర్తు చేశారు.