: చలికాలంలో చర్మాన్ని ఇలా కాపాడుకోవచ్చు
చలికాలంలో మనల్ని ఎక్కువగా వేధించే సమస్య చర్మం పగుళ్లు. చర్మం పొడిబారి పగులుతుంది. ఇది చాలా బాధిస్తుంది. దీని నివారణకు రకరకాల క్రీములు, లోషన్లను మనం రాస్తుంటాం. అలాకాకుండా ఒక్క మాత్ర వేసుకుంటే ఇలాంటి బాధలనుండి చక్కటి ఉపశమనాన్ని పొందవచ్చట.
శీతాకాలంలో వచ్చే చర్మ సమస్యలనుండి రక్షణ కల్పించేందుకు ఒక ప్రత్యేకమైన మాత్రను పరిశోధకులు రూపొందించారు. ఈ మాత్రను రోజుకు ఒకటి చొప్పున వేసుకోవడం వల్ల మంచు గాలుల వల్ల చర్మంపై దాడిచేసే పలు రకాలైన సమస్యలను దూరం చేయవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. బెసాన్కాన్ యూనివర్సిటీ ఆసుపత్రిలో చర్మ వ్యాధుల విభాగం అధిపతి ప్రొఫెసర్ ఫిలిప్ హంబర్ట్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం ఈ సరికొత్త ఔషధాన్ని రూపొందించింది. ఈ మాత్రను వేసుకోవడం వల్ల శీతాకాలంలో చర్మ సమస్యలను తగ్గిస్తుందని, పరిస్థితి మెరుగుపడుతుందని క్లినికల్ పరీక్షల్లో తేలినట్టు పరిశోధకులు చెబుతున్నారు.
ఈ కొత్తరకం మాత్రకు పర్‌ఫెక్టిల్ అని పేరుపెట్టారు. శీతాకాలంలో మంచు ప్రభావం ఎక్కువగా ముఖంపై పడుతుంది. దీనికారణంగా తర్వాత చాలాకాలం వరకూ సమస్యలను ఎదుర్కొనాల్సి వస్తుంది. ప్రతి ఏటా ఇలా చర్మం ఇలాంటి సమస్యలను ఎదుర్కొనే కారణంగా చర్మానికి ఉన్న మృదుత్వం, మందం, సాగేగుణం వంటి వాటిపై ప్రభావం చూపుతుంది. ఫలితంగా తొందరగానే చర్మంపై వార్ధక్యపు ఛాయలు పడతాయి. తాము రూపొందించిన పర్‌ఫెక్టిల్ మాత్రతో ఇలాంటి సమస్యలను దూరం చేయవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఈ మాత్రను లండన్‌లోని ఎన్నారై వ్యాపారవేత్త కర్తార్ లాల్వానీ స్థాపించిన వీటాబయోటిక్స్ సంస్థ ఉత్పత్తి చేస్తోందట.