: ఇక రైళ్లలో కంపుండదట!
రైళ్లలో బాత్రూంల నుంచి వచ్చే విపరీతమైన కంపుతో ప్రయాణీకులు ఇబ్బందులు పడుతుంటారు. అలా కాకుండా చక్కగా విమానాల్లో వాడే తరహా బాత్రూంలు ఉంటే ఎంత బాగుండునో... విమానాల్లో వాక్యూమ్ టాయిలెట్లు చక్కగా కంపు లేకుండా ఉంటాయి. ఇలాంటి తరహా టాయిలెట్లను ఇకపై రైళ్లలో కూడా ప్రవేశపెట్టాలని రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోంది.
విమానాల్లో ఉండే అత్యాధునిక వాక్యూమ్ టాయిలెట్లను రైళ్లలో కూడా ప్రవేశపెట్టడానికి రైల్వేశాఖ సిద్ధమవుతోంది. ముందుగా వీటిని స్వర్ణ శతాబ్ధి, పాలెస్ ఆన్ వీల్స్ వంటి సౌకర్యవంతమైన రైళ్లలో మాత్రమే ఏర్పాటు చేస్తారు. సుమారు రూ.25 కోట్ల వ్యయంతో పైలట్ ప్రాజెక్టులో భాగంగా వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఇలాంటి ఆధునికమైన టాయిలెట్లను మామూలు రైళ్లలో కూడా ఏర్పాటు చేయడానికి మరికొంత సమయం పట్టవచ్చు. అప్పుడు రైళ్లలో బాత్రూంలు దుర్గంధ రహితంగా ఉంటాయన్నమాట.