: హాయిగా నిద్రపోతే చాలు...
హాయిగా నిద్రపోతే చాలు ఆరోగ్యాన్ని పది కాలాలపాటు పదిలంగా కాపాడుకోవచ్చట. కొందరు పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో నిద్రతో ఎంతో మేలు జరుగుతుందని వెల్లడైంది. సుఖనిద్ర వల్ల అనవసరంగా వచ్చే ఆలోచనల నుండి దూరంగా ఉండడంతోబాటు, భవిష్యత్తులో మతిమరుపుకు సంబంధించిన అల్జీమర్స్ వ్యాధిని కూడా దూరం చేయవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.
ఇప్పటి ఉరుకుల పరుగుల జీవితంలో నిద్రా సమయం క్రమేపీ తగ్గుతూ వస్తోంది. రోజుకు కనీసం ఆరు గంటల సమయం పాటైనా నిద్ర పోవాలని నిపుణులు ఒకవైపు చెబుతున్నా, ఒత్తిడితో కూడిన జీవితం కారణంగా రాత్రిపూట సరిగా నిద్రపోని వారు కొందరైతే, రాత్రిపూటే విధులు నిర్వర్తించాల్సిన కారణంగా తక్కువ నిద్రపోయేవారు మరికొందరున్నారు. ఇలాంటి వారికి మతిమరుపు త్వరగా వచ్చే ముప్పు ఉందని పరిశోధకులు చెబుతున్నారు. అమెరికాకు చెందిన పరిశోధకులు నిర్వహించిన పరిశోధనలో మనం మేల్కొని ఉన్న సమయంలో మన మెదడులో అమిలాయిడ్ ప్రోటీన్‌లు అనే వ్యర్ధాలు పేరుకుని ఉంటాయని ఇలా పేరుకున్న వ్యర్ధాలు సరిగా శుభ్రపడకుంటే అవి తర్వాత కాలంలో మతిమరుపుకు కారణమవుతాయని తేలింది. నిద్రపోయే సమయంలో మెదడులో ఊరే గ్లింఫాటిక్ యాసిడ్లు ఇలా పేరుకుపోయిన వ్యర్ధాలను తొలగిస్తాయి. మళ్లీ మన మెదడును తాజాగా ఉంచుతాయి. కాబట్టి పనులు ఎక్కవైనాయనే కారణంగా తక్కువ నిద్రపోకుండా చక్కగా కంటినిండా నిద్రపోవడం వల్ల మతిమరుపు సమస్యను చాలా వరకూ తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.