: ముఖం పోయినా కొత్త ముఖం పెట్టవచ్చు!
ఏదైనా ప్రమాదంలో మన శరీర అవయవాలు పాడైపోయినా వాటి స్థానంలో కొత్త అవయవాలను అమర్చుకోవచ్చు. ఇలా అమర్చుకోవాలంటే ఎవరైనా దాతలు ఉండాలి కదా... అనుకుంటున్నారా... అలా దాతలు లేకున్నా ఫరవాలేదు. మన అవయవాలను చక్కగా ప్రింటు తీసి ఇస్తారు... వాటిని తీసుకొచ్చి మనం అమర్చుకోవచ్చు. ఇదంతా త్రీడీ సాంకేతిక పరిజ్ఞానం మహిమే.
బ్రిటన్‌కు చెందిన వైద్యులు ప్రమాదంలో గాయపడిన ఒక వ్యక్తి ముఖం స్థానంలో త్రీడీ పరిజ్ఞానంతో రూపొందిన కొత్త ముఖాన్ని అమర్చనున్నారు. మొన్నటికి మొన్న త్రీడీ పరిజ్ఞానంతో అతిచిన్న కృత్రిమ కాలేయాన్ని శాస్త్రవేత్తలు సృష్టించారు. ఇప్పుడు శాస్త్రవేత్తలు సీటీ స్కాన్ దృశ్యాల సాయంతో గాయపడిన వ్యక్తి ముఖాన్ని త్రీడీలో ముందుగా రూపొందించారు. తర్వాత ఎముకలను కచ్చితంగా ఎంతమేరకు కత్తిరించాలో, ఎక్కడెక్కడ కొత్తగా అమర్చాలో నిర్ధారించుకున్నారు. కృత్రిమ భాగాలను కూడా కచ్చితమైన కొలతల మేరకు తయారుచేయించారు. ఇక శస్త్రచికిత్స నిర్వహించడమే తరువాయి. స్వాన్‌సీన్ మోరిస్టన్ ఆసుపత్రికి చెందిన అడ్రియన్ సుగర్ నేతృత్వంలోని వైద్యుల బృందం ఈ ప్రక్రియలను తలపెట్టింది. ఈ శస్త్రచికిత్సకు సంబంధించిన డిజైన్‌ను అంతా కూడా కృత్రిమంగానే రూపొందించామని, త్వరలోనే పని మొదలుపెడతామని వైద్యులు చెబుతున్నారు.