: శనిగ్రహం రంగు ఎలా వుంటుందంటే...
భూమికి చాలా దూరంలో ఉండే శనిగ్రహం అప్పుడప్పుడూ భూమికి దగ్గరగా వచ్చి పలకరించి పోతుంటుంది. అప్పుడే మనం చాలా ఆసక్తిగా దాన్ని చూస్తుంటాం. అయితే ఈ గ్రహానికి సంబంధించిన సహజ రంగును గురించి శాస్త్రవేత్తలు తేల్చి చెప్పలేకుండేవారు. శనిగ్రహానికి సంబంధించిన సహజమైన రంగుతో కూడిన వర్ణచిత్రాన్ని ఇప్పుడు నాసా విడుదల చేసింది. దీంతో శనిగ్రహం రంగును గురించి అందరికీ ఒక స్పష్టత వచ్చింది.
'వేవ్ ఎట్ సాటర్న్' ప్రచారంలో భాగంగా కేసిని స్పేస్‌క్రాఫ్ట్ శనిగ్రహానికి సంబంధించిన చిత్రాలను తీస్తుందని ప్రజలకు ముందుగానే సమాచారమిచ్చిన నాసా ఈమేరకు జూలై 19న శనిగ్రహాన్ని చిత్రించే కార్యక్రమాన్ని చేపట్టింది. శనిగ్రహంతో కూడిన ఒక బ్రహ్మాండమైన వర్ణచిత్రాన్ని విడుదల చేసింది. ఈ వర్ణచిత్రంలో శనిగ్రహంతోబాటు దానికున్న ఏడు ఉపగ్రహాలు, ఇంకా గ్రహం చుట్టూ వున్న వలయాలు, శనిగ్రహానికి ఇరువైపులానున్న భూమి, శుక్రుడు, అంగారకుడు అన్నీ కూడా స్పష్టంగా కనిపిస్తుండడం విశేషం. నాసాకు చెందిన కేసిని వ్యోమనౌక తీసిన ఈ విశాలమైన చిత్రాన్ని మంగళవారం నాడు వాషింగ్టన్లో విడుదల చేశారు.
ఇందులో మొత్తం 141 దృశ్యాలను మేళవించి రూపొందించారు. ఈ చిత్రంలో శనిగ్రహానికి వున్న వలయాల మధ్య ఉన్న 6,51,591 కిలోమీటర్ల దూరమంతా కూడా ఇమిడివుంది. శనిగ్రహానికి కుడివైపున దిగువన నీలిరంగులో భూమి పెద్ద చుక్కలా కనిపిస్తుండగా, ఎడమవైపున పైభాగంలో ప్రకాశవంతంగా శుక్రగ్రహం కనిపిస్తోంది. దానికి కొంచెం పైభాగంలో ఎర్రని రంగులో అంగారకుడు కూడా ఈ చిత్రంలో కనిపిస్తాడు. ఈ చిత్రాన్ని కాస్త పెద్దదిగా చేస్తే భూమికి ఉన్న ఏకైక సహజ ఉపగ్రహం చంద్రుడిని కూడా ఇందులో చూడవచ్చు. శనిగ్రహం చుట్టూ ఉండే వలయాలు సాధారణ దృష్టికి కూడా కనిపించేలా ఇందులో ఉన్నాయి.