: రాజకీయ ప్రక్షాళనకు యువత ముందుకు రావాలి: 'ప్రతినిథి' ఆడియో వేడుకలో చంద్రబాబు
రాజకీయాల్ని ప్రక్షాళన చేయడానికి యువత రాజకీయాల్లోకి రావాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. నారా రోహిత్ హీరోగా రూపొందిన 'ప్రతినిథి' చిత్రం ఆడియో వేడుకలో ఆయన ప్రసంగించారు. ఈ రోజు హైదరాబాదులో జరిగిన ఈ వేడుకలో చంద్రబాబు ఆడియోను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, "ఇటీవల నేను కాలేజీలకు వెళ్ళినప్పుడు, మీరు జీవితంలో ఏం కావాలనుకుంటున్నారని విద్యార్ధుల్ని అడిగాను. ఎవరు చూసినా ఇంజనీరో, డాక్టరో, మరోటో చెప్పారు కానీ, రాజకీయాల్లోకి వస్తామని ఎవరూ చెప్పడం లేదు. అంటే, రాజకీయాల పట్ల వారికి విశ్వాసం పోయింది. అసంతృప్తిగా వున్నారు. ఇది మంచిది కాదు.
సమాజాన్ని రాజకీయాలు మారుస్తాయి. అందుకని కనీసం పది శాతం మంది విద్యార్దులైనా రాజకీయాల్లోకి రావాలి. ఈ సినిమాలో యువతకు ప్రతినిథిగా మా రోహిత్ నటించాడని తెలిసింది. ఈ సినిమా సమాజంలో మార్పు తీసుకువస్తుందని ఆశిస్తున్నాను. అందరికీ శుభాభినందనలు" అన్నారు. తాను యూనివర్శటీ కాంపస్ నుంచే రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే అయ్యానని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. అలాగే యుగపురుషుడు ఎన్టీఆర్ని స్పూర్తిగా తీసుకుని యువత ముందుకు పోవాలని ఆయన ఆకాంక్షించారు. ఇటువంటి కార్యక్రమాలలో ఎక్కువగా సీరియస్ గా కనిపించే చంద్రబాబు ఈ వేడుకలో ఉల్లాసంగా, చమక్కులు విసురుతూ అందర్నీ నవ్వించారు. ఇంకా నారా రోహిత్, నిర్మాత, దర్శకుడు తదితరులు కూడా మాట్లాడారు.