: ఇంత వరకు ఉద్యమం శాంతియుతంగా సాగింది.. ఇక హింసే: కోడెల
రాష్ట్రంలోని ఆరున్నర కోట్ల మంది ప్రజలకు ఇష్టం లేని విభజనను... కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం బలవంతంగా ముందుకు తీసుకెళ్తోందని టీడీపీ నేత కోడెల శివప్రసాద్ విమర్శించారు. సాంప్రదాయాలు, రాజ్యాంగ స్పూర్తి, చట్టాలను కాంగ్రెస్ పార్టీ తుంగలో తొక్కేసిందని అన్నారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ, ఇంతవరకు కోట్లాది మంది ప్రజలు శాంతియుతంగా ఉద్యమం చేస్తున్నారని, దాన్ని అలుసుగా తీసుకుని ప్రజా ఉద్యమాన్ని లెక్క చేయకపోతే ఉద్యమం హింసాత్మకంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అన్ని పక్షాలను ఒక చోట కూర్చోబెట్టి ముందుగా కాంగ్రెస్ పార్టీ తన విధానాన్ని స్పష్టం చేయాలని... తరువాత ఇతర పార్టీల అభిప్రాయాలు తీసుకోవాలని సూచించారు.
ఉద్యోగాలకు ఇంటర్వ్యూల్లా ఇతర పార్టీల వాదనలు వినడం దారుణమని కోడెల అన్నారు. కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కట్టడి చేయాల్సిందిగా రాష్ట్రపతికి టీడీపీ తరపున లేఖ రాస్తామని కోడెల తెలిపారు. జగన్ విభజన వాది అని, సమైక్యం అంటున్న జగన్ విభజనపై జరిగిన అఖిలపక్షానికి ప్రతినిథులను ఎలా పంపించాడని ఆయన ప్రశ్నించారు. అవినీతిపరుడైన జగన్ విభజన వల్ల లాభపడేందుకు ప్రణాళికలు రచిస్తున్నాడని అన్నారు.