: వారి దగ్గర వివరాలే లేవు.. విభజన ఎలా చేస్తారు?: కిషన్ రెడ్డి
విభజన వల్ల సీమాంధ్ర ప్రజల్లో ఏర్పడిన అనుమానాలను తీర్చాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఢిల్లీలో జీవోఎంతో భేటీ అయిన అనంతరం ఆయన మాట్లాడుతూ... 11 అంశాలపై కేంద్రం ఏం చేయబోతోందో ముందు చెప్పాలని కోరామన్నారు. బీజేపీ విభజన నిర్ణయానికి కట్టుబడి ఉన్నప్పటికీ, సీమాంధ్రుల ఆందోళనలు పట్టించుకోవాలని కోరినట్టు తెలిపారు. కేంద్రం తమ అభిప్రాయాలు, మార్గదర్శకాలు ముందుగా బయటపెట్టాలని అన్నారు.
ఇరు ప్రాంతాల ప్రజల్లో కాంగ్రెస్ నేతలు విద్వేషాలు రేపుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజల్లో విభేదాలకు కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలని అన్నారు. విభజన జరిగితే సీమాంధ్రకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విభజనపై మరింత విస్తృతంగా జాతీయ పార్టీలతో చర్చించాల్సి ఉందని సూచించామన్నారు. విభజనపై రాష్ట్రానికి సంబంధించిన వివరాలేవీ మంత్రుల బృందం దగ్గర లేవన్నారు. వివరాలు లేకుండా ఎలా విభజన చేస్తారని తాము ప్రశ్నించామన్నారు. కాంగ్రెస్ పార్టీకి విభజనపై స్పష్టత లేదని ఆయన విమర్శించారు. శీతాకాల సమావేశాల్లో బిల్లు పెట్టాలని సూచించినట్టు తెలిపారు. రాష్ట్రానికి సంబంధించిన మొత్తం ఆదాయ, వ్యయ వివరాలు కోరామని కిషన్ రెడ్డి తెలిపారు.